Minister Roja Over TDP-Janasena First List: టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల మొదటి లిస్టును ప్రకటించడంపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పొత్తులో భాగంగా పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ప్యాకేజీ కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నావ్? అని ప్రశ్నించారు. 24 సీట్లకే తోక ఊపుకుంటు చంద్రబాబుతో పోత్తు పెట్టుకున్నారని చురకలు అంటించారు.
పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో కనీసం జనసేన (Janasena) కార్యకర్తలకు కూడా అర్థంకావటం లేదని మంత్రి రోజా అన్నారు. ముష్టి 24 సీట్లకు ఎందుకు తలవంచవో జనసైనికులకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని అన్నారు. 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఒకవైపు, సినిమాలు చేసుకునే పవర్ లేని పవర్ స్టార్ ఒక వైపు అని సెటైర్లు వేశారు. జగనన్న ఒడించలేకే పొత్తుల కార్యక్రమం మొదలుపెట్టారని పేర్కొన్నారు. వాళ్లలో వాళ్లకే గందరగోళం, ఈ పరిస్థితిలో 118 స్థానాలు ప్రకటించారని అన్నారు. ఇందులో చంద్రబాబు (Chandrababu), లోకేష్, బాలకృష్ణ స్థానాలు కూడా ప్రకటించారు.. కానీ, పవన్ ఎక్కడనుంచి పోటీ చేస్తారో చెప్పలేదని అన్నారు. ఎందుకంటే 1 స్థానంలో ఒడిపోయిన వారికి మొదటి జాబితాలో, 2 స్థానాల్లో ఒడిపోయినవారికి రెండవ జాబితాలో పేరు ఇస్తారేమో పవన్ తెలుసుకోవాలని సెటైర్లు వేశారు.
Also Read: అలా ఇస్తే లక్కి నంబర్..ఇలా ఇస్తే పావలా.. జనసేనకు ఆర్జీవీ పంచులు!
పవన్ కు సత్తా లేదు: సజ్జల
పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించడంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారని పేర్కొన్నారు. పవన్ ను చూస్తే జాలి వేస్తోందని అన్నారు. రాజకీయ పార్టీని నడిపే సత్తా పవన్ కళ్యాణ్ కు లేదని విమర్శించారు. అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని వ్యాఖ్యానించారు. జనసేన పోటీ చేసే 24 సీట్లల్లో కూడా ఉన్నది చంద్రబాబు అభ్యర్థులే అని పేర్కొన్నారు. జనసేనను మింగేసి చంద్రబాబు ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపణలు చేశారు. పవన్ ను అభిమానించే వారు ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు. 175 స్థానాల్లో పోటీకి నిలబెట్టేందుకు చంద్రబాబుకు అభ్యర్థులు లేరని చురకలు అంటించారు.