AP CM Chandra babu: వరద నష్టంపై శుక్రవారం సాయంత్రానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తక్షణ సాయం కోసం మొదటగా ప్రాథమిక నివేదిక.. ఆ తర్వాత సమగ్ర నివేదికను కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరాను పునరుద్ధరించామని చంద్రబాబు చెప్పారు. చాలా ప్రాంతాలో విద్యుత్ కూడా వచ్చిందని చెప్పారు. కొన్ని ప్రాంతాలో నీరు నిల్వ ఉండిపోవడం వల్లనే అక్కడ విద్యుత్‌ను పునరుద్దరించలేకపోయామని తెలిపారు. పారిశుద్ధ్య పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలను తెప్పిస్తున్నామని తెలిపారు.
చెప్పినట్టుగానే వరద బాధితుల కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాం. ఆ ప్రాంతాలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పించాం. కూరగాయలన్నీ రూ.2, రూ.5, రూ.10కే అందిస్తాం. ఒక్కో ఇంటికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో పప్పు ఇస్తున్నాం. బాధితుల అవసరాలు తీర్చేందుకు శక్తిమేర కృషి చేస్తున్నామని చెప్పారు బాబు. 20కి పైగా సెల్ ఫోన్ టవర్లు పని చేసేటట్టు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
వరదలకు కారణం గత ప్రభుత్వమే..
ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వరదలు రావడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మూడు వంతెనలను పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఇలా జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు. అప్పుడు గండ్లు పూడ్చి ఉంటే ఇప్పుడు బుడమేరు పొంగేది కాదని అన్నారు. అప్పట్లో బుడమేరు కాల్వ అభివృద్ధి పనులను చేపట్టి.. నిధులు కేటాయిస్తే.. దాన్ని నిలిపివేసింది వైసీపీ. తప్పు చేసి.. ఎదురు విమర్శలు చేయాలనుకునే వాళ్ల ఆటలు చెల్లవు అని ఆయన హెచ్చరించారు. వారు చేసిన తప్పుల కారణంగా 1.40 లక్షల ఇళ్లల్లోకి నీరొచ్చింది. ఇప్పుడు ఆ తప్పులను పూడ్చడానికే తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు చంద్రబాబు. 15 లక్షల క్యూసెక్కుల నీరు డిశ్చార్జ్ చేయడానికి వీలుగా ప్రకాశం బ్యారేజీని బలోపేతం చేస్తున్నాం. బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని రప్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
Also Read: Telangana: జైనూర్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్