AP Election Results : 'పుష్ప' పరాభవం

బాబాయ్ పవన్ ని కాదని ఫ్రెండ్ కి సపోర్ట్ చేసాడు బన్నీ. అతని గెలుపు కోసం ప్రత్యక్షంగా వెళ్లి ప్రచారం కూడా చేశాడు. కానీ ఎన్నికల్లో మాత్రం బన్నీ ప్రయత్నం ఫలించలేదు. పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించగా.. బన్నీ స్నేహితుడు శిల్పా రవిచంద్రా రెడ్డి మాత్రం పరాజయం పాలయ్యాడు.

New Update
AP Election Results : 'పుష్ప' పరాభవం

Pawan Kalyan VS Allu Arjun : పవర్ స్టార్ అంటే చాలు పవన్ అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. ఆయన సినిమాలంటే పడి చచ్చిపోతారు. ఆయన మాట్లాడుతుంటే మైమరచిపోతారు. తన సినిమాలతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కు రాజకీయంగా ఈనాటి గెలుపు అంత ఈజీగా రాలేదు. 10 సంవత్సరాల ఎదురుచూపు. తన కుటుంబ సభ్యులు, ఎంతోమంది అభిమానులు, జనసేన కార్యకర్తల అండదండలతో విజయాన్ని అందుకున్నారు. ఈ గెలుపులో పవన్ వెంట మెగా కుటుంబం మొత్తం నడిచింది. అయితే బన్నీ కుటుంబం మాత్రం దూరం నుండి అంతా చూసింది. తన బాబాయ్ పవన్ విజయానికి ప్రత్యక్ష ప్రచారానికి రాని బన్నీ వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డి కోసం చేసిన ప్రచారం మాత్రం తుస్సుమంది. ఇప్పుడు ఇదే విషయంపై అంతటా చర్చ జరుగుతోంది.

పవన్ కల్యాణ్ 2008 లో రాజకీయాల్లోకి వచ్చారు. తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యాక తన అన్నపై మౌనంగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ ఆ పార్టీని విడిచిపెట్టారు. 2014 లో జనసేన పార్టీని స్ధాపించారు. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుండి పోటీ చేసిన పవన్ కల్యాణ్ పరాజయం పాలయ్యారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయాణం సాగించారు. 2024 లో ఒంటరి పోరాటం పక్కన పెట్టి బీజేపీ, టీడీపీతో కూటమిగా జతకట్టారు. కూటమి ఘన విజయంలో కీలక పాత్ర వహించారు పవన్ కల్యాణ్. ఈ గెలుపులో ఎన్నో అడుగులు జత కలిశాయి. జనసైనికులతో పాటు సినీ సెలబ్రిటీలు, అభిమానులు అండగా నిలబడ్డారు.

పవన్ విజయంలో మెగా కుటుంబం పాత్ర గురించి చెప్పాలి. గతంలో జరిగిన ఎన్నికల్లో పవన్ కు పెద్దగా మద్దతు పలకని మెగా కుటుంబం ఈసారి జరిగిన ఎన్నికల్లో ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు, నాగబాబు, రామ్ చరణ్,సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, పవన్ వదినలు సురేఖ, పద్మజలు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. ఎలాగైనా పవన్ ను గెలిపించాలని ఇంటింటికి తిరిగారు. ఓవైపు మెగా కుటుంబం పవన్ గెలుపు కోసం కష్టపడుతుంటే అటు అల్లు అరవింద్ కుటుంబం మాత్రం సైలెంటై పోయింది. ఇక బాబాయ్ పవన్ గెలుపు కోసం బయటకు రాని బన్నీ వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గెలుపు కోసం భార్య స్నేహా రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొనడం దుమారం రేపింది. బాబాయ్ ని కాదని అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయడమేంటని పవన్ అభిమానులు మండిపడ్డారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు.

ఇక తప్పదన్నట్లు అల్లు అర్జున్ తన ప్రేమ, మద్దతు పవన్ కి ఎప్పుడూ ఉంటుందని.. పవన్ ఆశించిన విజయం అందుకుంటారని ట్వీట్ చేసి సరిపెట్టేశారు. అయినా బాబాయ్ విషయంలో బన్నీ చేసిన పని మాత్రం చాలామందికి తప్పనిపించింది. ఇక బన్నీ సంగతి ఇలా ఉంటే అల్లు అరవింద్ సైతం పవన్ గెలుపు కోసం పెద్దగా స్పందించలేదు. బన్నీ సొంత బ్రదర్స్ కూడా ఎక్కడా ప్రచారంలో కనిపించలేదు. సీన్ కట్ చేస్తే బన్నీ కష్టపడి ప్రచారం చేసిన నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాత్రం పరాజయం పాలయ్యారు. శిల్పా రవిచంద్రా రెడ్డికి పుష్ప ప్రచారం కలిసి రాలేదని పవన్ అభిమానులు చర్చించుకుంటున్నారు. బన్నీని ట్రోల్ చేస్తున్నారు. బాబాయ్ ని పక్కకు పెట్టి బయటోడికి సపోర్ట్ చేస్తే ఇలాగే ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా పవన్ ఈ గెలుపు వెనుక జనసైనికులు, అభిమానులు, సినీ సెలబ్రిటీలతో పాటు మెగా కుటుంబం పాత్ర కూడా చాలానే ఉందని చెప్పాలి.

Also Read: పవన్‌ కల్యాణ్‌ కు సినీ ప్రముఖుల అభినందనలు..వైరల్‌ అవుతున్న ట్వీట్లు!

Advertisment
తాజా కథనాలు