రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. గతేడాది అక్కడ కొచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న పలువురు విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. అయితే ఇప్పుడు తాజాగా కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో 'నీట్' పరీక్ష కోసం సిద్ధమవుతున్న ఓ విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఏడాది ఇదే మొదటి ఆత్మహత్య కావడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: రోడ్డు ప్రమాదానికి గురైన దీదీ.. తలకు గాయం
నీట్ కోచింగ్
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన మహ్మద్ జైద్ అనే 18 ఏళ్ల విద్యార్థి కోటలోని హాస్టల్‌లో ఉంటూ నీట్ పరీక్ష కోసం సిద్ధమవుతున్నాడు. అయితే మంగళవారం అర్థరాత్రి తన గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది చూసిన తోటి విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గతేడాది 29 మంది ఆత్మహత్య
ఇదిలాఉండగా.. రాజస్థాన్‌లోని కోటా కోచింగ్ సెంటర్లకు హబ్. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది విద్యార్థులు పలు పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకునేందుకు ఇక్కడికి వస్తారు. అయితే 2023లో కోటాలో మొత్తం 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కోచింగ్ సెంటర్‌లో అధిక ఒత్తిడి వల్ల.. కొందరు విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. అందుకే ఇలాంటి దుర్ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఆత్మహత్యలు తగ్గడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: ఒంటిరిగానే పోటీ చేస్తాం.. ఇండియా కూటమికి దీదీ షాక్