/rtv/media/media_files/2025/10/28/flights-2025-10-28-09-37-42.jpg)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తుఫాను వేగంగా కదులుతోంది. ఇది అంతకంతకూ బలపడుతోంది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 230కి.మీ, కాకినాడకి 310కి.మీ విశాఖపట్నంకి 370కి.మీ,దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా తుఫాను కదిలిందని వాతావరణశాఖ చెబుతోంది. ఈరోజు సాయంత్రానికి మచిలీ పట్నం, కళింగ పట్నం మధ్య కాకినాడ దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని కారణంగా తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో ఈదురు గాలుల వీస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. తుఫాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే విశాఖలో గడిచిన 24 గంటల్లో 15 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలను కలిపి మొత్తం 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది.
విమాన రాకపోకలు రద్దు..
తుఫాను కారణంగా విజయ వాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఎయిర్ ఇండియా, ఇండిగో సర్వీసులన్నింటినీ రద్దు చేశారు. ఇండిగోకు సంబంధించి ఉదయం 10.45 వరకు నడిచేవి, ఢిల్లీ - విజయవాడ మధ్య నడిచే సర్వీసు మాత్రం యథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి. ఇక విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. వీటిలో ఢిల్లీ, భువనేశ్వర్, విజయవాడ, రాయ్పూర్, హైదరాబాద్, బెంగళూరుకు రాకపోకలు కొనసాగుతున్నాయి.
17 జిల్లాలకు రెడ్ అలెర్ట్..
ఏపీలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాలో ఎల్లుండి కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని అంది. ఈరోజు 17 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్, మరో నాలుగు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు ఎని మిది జిల్లాలకు 'రెడ్..తొమ్మిది జిల్లా లకు 'ఆరెంజ్.. మరో నాలుగు జిల్లా లకు 'ఏల్లో' అలర్ట్ జారీ అయింది.
Follow Us