/rtv/media/media_files/2025/11/10/tirumala-adulterated-ghee-controversy-2025-11-10-17-05-14.jpg)
Tirumala adulterated ghee controversy
Tirumala Ghee Adulteration: టీటీడీ నకిలీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీకీ నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు సీబీఐ తేల్చింది. పామాయిల్‌కు రసాయనాలు కలిసి..ఆవునెయ్యి మాదిరిగా కనిపించేలా, సువాసన వచ్చేలా చేసి.. TTDకి సరఫరా చేశారని కోర్టుకు CBI నివేదిక అందజేసింది.TTDతో పాటు ఏపీలోని ప్రముఖ ఆలయాలైన కాణిపాకం, శ్రీకాళహస్తి.. శ్రీశైలం, విజయవాడ, ద్వారకా తిరుమల...పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయాలకు నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు సీబీఐ గుర్తించింది. రూ.250 కోట్ల నకిలీ నెయ్యి సరఫరా చేసినట్లు గుర్తించింది.సుమారు ఐదేళ్ల పాటు నకిలీ నెయ్యి సరఫరా కొనసాగింది. భోలే బాబా డెయిరీ ఒక్క చుక్క పాలు సేకరించకుండానే 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి సరఫరా చేసిందని సీబీఐ నివేదకలో వెల్లడించింది. 2022లో బ్లాక్ లిస్టులో పెట్టినప్పటికీ ఇతర డెయిరీల ద్వారా సరఫరా చేసినట్లు సీబీఐ గుర్తించింది.
మరోవైపు కల్తీ నెయ్యి విషయంలో నాటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని సిట్ పేర్కొంది. సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి బ్యాంకు లావాదేవీలను పరిశీలించేందుకు అనుమతి కోరుతున్నట్లు సిట్ కోర్టుకు తెలిపింది. ఆ ఇద్దరూ దాఖలు వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని సిట్ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి పీఏను అరెస్ట్ చేసిన సిట్.. తాజాగా సుబ్బారెడ్డి పాత్రపై అనుమానాస్పదంగా ఉందంటూ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తీసుకురావడానికి సుబ్బారెడ్డి, ఆయన సతీమణి బ్యాంకు లావాదేవీల వివరాలు కోరుతున్నట్లు పేర్కొంది. నేర ఘటనతో బ్యాంకు లావాదేవీలు ముడిపడి ఉన్నట్లు దర్యాప్తు అధికారికి అనుమానం వస్తే ఆ బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలించే అధికారం ఉంటుందని కోర్టుకు తెలిపింది. వైవీ సుబ్బారెడ్డి 2019-2023 మధ్య టీటీడీ ఛైర్మన్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ఛైర్మన్ హోదాలో ఆయన అనామక ఫిర్యాదును 2022 మే 16న టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం ఆర్‌ఎస్‌ఎస్‌వీఆర్ సుబ్రహ్మణ్యానికి అప్పగించడంతో పాటు భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్‌పై విచారణ జరిపించాలని కోరినట్లు పేర్కొంది.
కాగా, తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో వైవీ సుబ్బారెడ్డిని 2022 మే 20న సుబ్ర హ్మణ్యం కలిసినప్పుడు నెయ్యి నమూనాలను పరీక్ష కోసం మైసూరులోని CFTRI ల్యాబ్‌కు పంపించాలని పురమాయించినట్లు తెలిపింది. దీంతో ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డెయిరీ స్పెషాల్టీస్ లిమిటెడ్, భోలేబాబా డెయిరీలు సరఫరా చేసిన నెయ్యి నమూనాలను 2022 జూన్‌లో ల్యాబ్‌కు పంపారని వివరించింది. నెయ్యి నమూనా పరీక్ష ఫలితాలు 2022 ఆగస్టులో వచ్చాయని. బీటా సిటోస్టెరాల్ పరీక్ష ప్రకారం అన్ని నెయ్యి నమూనాల్లో విజిటబుల్ ఆయిల్ కల్తీ జరిగినట్లు తేలినట్లు వివరించింది. ఈ విషయాన్ని సుబ్రహ్మణ్యం వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆ నెయ్యి సరఫరా చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. పైగా 2024 వరకు ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్, వైష్ణవి డెయిరీ స్పెషాల్టీస్ సంస్థలను టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు అనుమతించారని వివరించింది.కాగా, భోలేబాబా డెయిరీ నుంచి 2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరాకు అనుమతించారని పేర్కొంది.
ఇక కల్తీ నెయ్యి కేసులో A-3గా ఉన్న భోలేబాబా డెయిరీ డైరెక్టర్ పొమిల్ జైన్, కైలాష్ చంద్, శ్రీనివాసన్ 2022 మే 25న వైవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో లిశారని హైకోర్టులో వేసిన కౌంటర్‌లో సిట్ పేర్కొంది. సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న కిలో నెయ్యి సరఫరాకు 25 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఈ సందర్భంగా సుబ్బారెడ్డికి పొమిల్ జైన్ ఫిర్యాదు చేశారని తెలిపింది. ఏడాది పాటు తన ప్లాంటులో ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండా సుబ్బారెడ్డిని పొమిల్ జైన్ విజ్ఞప్తి చేశారని వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తోందని సిట్ ఐవో హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తులో అన్ని విషయాలను పరిశీలించాల్సి ఉందని కౌంటర్ వివరించారు.
ఇది కూడా చూడండి: Viral Video: డిప్యూటీ సీఎంపై చెప్పులు, పేడ విసిరిన ప్రజలు.. వీడియో వైరల్!
Follow Us