/rtv/media/media_files/2025/09/15/fighting-for-a-seat-in-an-rtc-bus-2025-09-15-09-20-59.jpg)
Fighting for a seat in an RTC bus
Andhra News: ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన విషయం తెలిసిందే. బస్సు ప్రారంభించిన నాటినుంచే బస్సుల్లో సీట్ల కోసం మహిళలు సిగపట్లు పట్టుకుంటున్నారు. ఒకరి ఒకరు దాడులు చేసుకుంటున్నారు. గతంలో తెలంగాణలో ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభమైన సందర్భంలో మొదలైన ఘర్షణ ఇంకా కొనసాగుతుండగా తాజాగా ఏపీలోనూ సీట్ల కోసం ఫైటింగ్ తప్పడం లేదు. ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో చోటు చేసుకుంది. పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారి దేవాలయానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ బయలుదేరిన ఆర్టీసీ బస్సు(నంబరు 118)లో 60 మంది ప్రయాణికులు ఎక్కారు. వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. సీటు విషయంలో ఇద్దరు మహిళలు వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. మరోపక్క ఇరువైపుల బంధువులు వారికి మద్దతుగా నిలవడంతో గొడవ ఎక్కువయ్యింది. ఈ క్రమంలో ఆ ఇద్దరు నీళ్ల సీసాలతో దాడులు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి:ఏపీలో దారుణం.. భార్యను రోకలి బండతో హత్య చేసి గొంతు కోసుకున్న భర్త
అయినా డ్రైవర్ బస్సు ఆపకపోవడంతో మిగిలిన ప్రయాణికులు సహనం కోల్పోయారు. బస్సు నందిగామ సమీప మునగచర్ల అడ్డురోడ్డు వద్దకు రాగానే కొంతమంది ప్రయాణికులు లేచి బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని కోరడంతో మహిళల గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనను ఓ ప్రయాణికుడు తన మొబైల్‌తో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం అమలు చేయడంతో బస్సుల్లో మహిళా ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. దీంతో తిరుపతమ్మ ఆలయానికి భక్తుల తాకిడి మరింత ఎక్కువయ్యింది. బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ అధికారులు అదనంగా బస్సులు నడపాలని భక్తులు కోరుతున్నారు. కాగా ఉచిత బస్సు ప్రయాణంలో ఒకే బస్సులో ఎక్కువమందిని ఎక్కిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హ*త్య