తప్పు చేసిన వారు సొంత పార్టీ నేతలైనా ఊరుకునేదే లేదు అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సొంత పార్టీ కదా అన పిచ్చి పిచ్చి వేషాలేస్తే తోలు తీస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. రీసెంట్ గా ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. సొంత పార్టీ వారై వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దాంతో పాటూ తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేయాల్సిందేనంటూ పోలీసులకు ఆదేశాలు చేశారు. అలాగే ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బుడ్డాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గేటు తీయలేదని సిబ్బందిపై దాడి..
శ్రీశైలం ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీశాఖ సిబ్బందిపై దాడి చేశారు. తన కోసం ఫారెస్టు చెక్‌పోస్టు గేటు తీయలేదని, పిలవగానే దగ్గరకు రాలేదంటూ కోపంతో మండిపడ్డారు. అదే ఆవేశంలో అక్కడికి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ పెట్రోలింగ్ సిబ్బందిని పిలిచి వారిపై జులుం ప్రదర్శించారు. వారిని బలవంతంగా పెట్రోలింగ్ వాహనంలో కూర్చోపెట్టి మరీ చిత్రహింసలు పెట్టారు. ఆ వాహనాన్ని స్వయంగా బుడ్డానే నడిపినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తన అనుచరులతో కూడా పోలీసులపై దాడి చేయించారు. ఈ మొత్తం ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అటవీశాఖ సిబ్బంది ఇచ్చిన సమాచారం ప్రకారం బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి మంగళవారం రాత్రి శ్రీశైలం వెళ్ళారు. 10 గంటలప్పుడు వాళ్ళ వాహనాలు శిఖరం దాటుకుని అటవీశాఖ చెక్‌పోస్టు దగ్గరకు చేరుకున్నాయి. ఆ సమయానికి చెక్ పోస్ట్ గేటు వేసి ఉంది. అప్పటికే అక్కడ మరో నాలుగు వాహనాలు కూడా ఉన్నాయి. శ్రీశైలం నుంచి దోర్నాల వెళుతున్న భక్తులకు చెందిన ఆ వాహనాలను.. సమయం అయిపోయిందంటూ చెక్‌పోస్టు సిబ్బంది నిలిపివేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే బొడ్డా ఆ భక్తుల వాహనాలను పంపించేసి...తనకు కూడా దారి వదలాలంటూ పొగరుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే అయినా తనను చూడగానే వచ్చి గేటు తెరవలేదు అంటూ దుర్భాషలాడారు. ఫారెస్ట్ సిబ్బందిని పిలవండి అంటూ కేకలు వేశారు. వారు రాగానే బూతులతో రెచ్చిపోతూ చెయ్యి చేసుకున్నారు. దాని తరువాత అర్ధరాత్రి వరకూ వారిని వాహనంలో ఎక్కించి చిత్రహింసలకు పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన వారిలో నక్కంటి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములునాయక్, చిన్నారుట్ల గార్డు గురువయ్య, డ్రైవర్ కరీముల్లా అనే వారిని గుర్తించారు. ఈ ఘటనపై శ్రీశైలం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు.