రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి డ్రోన్ చక్కర్లు కొట్టిన ఘటన కలకలం రేపుతోంది. గత 2 రోజులుగా రాత్రి సమయంలో జైలుపై డ్రోన్లు ఎగురుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై జైలు అధికారులు నిన్న రాత్రి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఒక అపార్ట్మెంట్ నుంచి డ్రోన్లు ఎగురుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ మిథన్ రెడ్డి ఇప్పుడు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో తమ నేతపై రెక్కీ నిర్వహిస్తున్నారని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజనిజాలు బయట పెట్టేందుకు డ్రోన్ ఎవరు ఎగరవేశారు..? ఎందుకు ఎగరవేశారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:BIG BREAKING: జగన్ నెల్లూరు టూర్ లో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై లాఠీ ఛార్జ్!
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నట్లు సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఆయన ఏ-4గా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానాన్ని మార్చడంలో, డొల్ల కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడంలో మిథున్ రెడ్డి కీ రోల్ పోషించారని సిట్ చెబుతోంది. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.3,200 కోట్ల నష్టం వాటిల్లినట్లు సిట్ అధికారుల అంచనాగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి ఫాంహౌస్‌పై సిట్ అధికారుల రైడ్స్
ఈ వ్యవహారంలో ముడుపులు తీసుకుని, నకిలీ కంపెనీల ద్వారా హవాలా పద్ధతిలో డబ్బును తరలించారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ డబ్బును 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల కోసం ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. దీంతో సిట్ అధికారులు ఆయనను సుదీర్ఘంగా విచారించి, అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే అయిన పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుమారుడైన మిథున్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది.
జగన్ మెడకు లిక్కర్ కేసు..
దీంతో మిథున్ రెడ్డి అరెస్ట్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనంగా మారింది. దీంతో ఈ కేసు మాజీ సీఎం జగన్ మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. ఈ మేరకు త్వరలోనే జగన్ నివాసంలోనూ సోదాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కూటమి ప్రభుత్వం కుట్రతోనే తమ నేతలను కేసుల్లో ఇరికిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అసలు లిక్కర్ స్కామే జరగలేదని చెబుతున్నారు. ఈ కేసు అంతా ఓ కట్టు కథ అని కొట్టిపారేస్తున్నారు. తమ ముఖ్య నేతలు వల్లభనేని వంశీ, నందిగం సురేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి తదితరులను ఇప్పటికే కుట్రతో కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేశారని ధ్వజమెత్తుతున్నారు.