ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది హైకోర్టు. కురుపాంలో జరిగిన అమ్మవడి కార్యక్రమానికి వేలాది మంది స్కూల్ పిల్లల్ని పిలవడంపై కోర్టు నోటీసులు జారీ చేసింది. స్కూల్ పిల్లల్ని రాజకీయ కార్యక్రమానికి పిలవడంపై హైకోర్టు మండిపడింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు, హోంశాఖ కార్యదర్శి గుప్తాకి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం.
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నప్పటికీ వేలాదిమంది చిన్నపిల్లలను రాజకీయ కార్యక్రమాలకు పిలిచి వారి ముందు రాజకీయ ప్రసంగాలు చేయటంపై.. హైకోర్టులో గిరిజన హక్కుల పోరాట సమితి శ్రీకాకుళం అధ్యక్షులు సరవ చొక్కారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టింది కోర్టు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నప్పటికీ స్కూలుకు వెళ్లే పిల్లలను నిర్బంధించి వారి ముందు రాజకీయ ప్రసంగాలు చేయటం కోర్టు ధిక్కరణ అవుతుందని లాయర్ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
న్యాయవాది శ్రవణ్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ప్రతివాదులుగా ఉన్న ప్రిన్సిపల్ సెక్రెటరీ స్కూల్ ఎడ్యుకేషన్, హోం శాఖకి.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.