2024-2025 ఆర్థిక ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.48.21 లక్షల కోట్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు పెద్దపీట వేసింది. అమరావతి కోసం రూ.15 వేల కోట్లు అందిస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా చేసేందుకు ప్రతిపాదన చేశారు. ఇందుకు సంబంధించి అక్కడ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్.. రాజధానిగా అమరావతిని తిరస్కరించారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత హైకోర్టు నుంచి జగన్‌కు వ్యతిరేకంగా తీర్పు రావడం, ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో.. చివరికి మూడు రాజధానుల ఆలోచనను విరమించుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు తాను విశాఖపట్నంకు షిఫ్ట్ అవుతున్నానని.. ఎన్నికల తర్వాతే విశాఖపట్నమే ఏపీ రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తాము గెలిస్తే అమరావతినే రాజధానిగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చివరికి 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. అమరావతిలో ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభించారు.
Also read: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా…?
అమరావతి వివాదం
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన కొన్ని నెలల తర్వాత అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించారు. 2015 అక్టోబర్ 22న ప్రధాన మంత్రి మోదీ రాజధాని నిర్మాణానికి అమరావతిలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని 8603.32 Sq కిలోమీటర్ల వరకు విస్తరింపజేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం అమరావతిలో రైతుల నుంచి 34,400 ఎకరాల భూమిని సేకరించింది. అలాగే ఏపీసీఆర్‌డీఏ (APCRDA) వివిధ బాండ్ల ద్వారా రూ.2 వేల కోట్ల నిధులు సేకరించింది. మొత్తంగా అమరావతి రాజధానిని 53,748 ఎకరాల్లో నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది. 2016లో అమరావతి నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది.
తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాలు ఇప్పటికే అక్కడ పూర్తయ్యాయి. 2019లో టీడీపీ ఓడిపోయిన అనంతరం వైసీపీ అమరావతి ప్రణాళికను రద్దు చేసింది. ఆ తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీనిపై టీడీపీతో పాటు అమరావతి రైతులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారించిన ఏపీ న్యాయస్థానం.. అమరావతిలోనే రాజధాని నిర్మాణం పూర్తి చేయాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో వైసీపీ పార్టీ మూడు రాజధానులకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించిన కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
Also read: ఈ సారి గోల్డ్ కొడతారా.. టీమిండియా హాకీ జట్టుపై కోటి ఆశలు!
వైసీపీ హయాంలోనే మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు నిరసలు చేయడం ప్రారంభించారు. మొత్తం 1,631 రోజుల పాటు నిరసనలు జరిగాయి. చివరికి 2024లో ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అమరాతిని రాజధానిగా ప్రకటించారు. ఇప్పటికే అక్కడ పనులు ప్రారంభమయ్యాయి.
2014 నుంచి 2019 వరకు అమరావతి రాజధాని వ్యయం అంచనాలు
ప్రభుత్వ కాంప్లెక్స్‌లకు రూ.1,556 కోట్లు
అసెంబ్లీ భవనానికి రూ.555 కోట్లు
హైకోర్టు, సెక్రటేరియట్ భవనాలకు రూ.3,536 కోట్లు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఏఐఎస్ అధికారులు, అధికారులు, ఎన్జీవో నివాసాలకు రూ.3, 539 కోట్లు
29,900 మంది రైతులు మొత్తం 34,281 ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చేశారు
రాజధాని నగరం 53,748 ఎకరాల్లో నిర్మించాలని ప్లాన్ చేశారు
8,603 sq km వరకు రాజధానిని విస్తరించాలని ప్రణాళిక రూపొందించారు.