లోక్‌సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓవైపు మూడోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ.. మరోవైపు మోదీ సర్కార్‌ను గద్దె దింపాలని విపక్ష పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇటీవల కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రస్తుతం భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ - సమాజ్‌వాద్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒప్పందం కుదిరింది.
Also read: దేశంలో కస్డడీ రేప్ కేసులు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ..
ఇదే మొదటిసారి
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాకు చేరుకున్న తర్వాత అఖిలేష్ పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ యాత్ర ప్రారంభమైన తర్వాత విపక్ష పార్టీలకు చెందిన కీలక నేత ఇందులో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అంతకుముందు కూడా పశ్చిమ బెంగాల్‌లో యాత్ర కొనసాగేటప్పుడు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ పాల్గొనే అవకాశాలనున్నాయని వార్తలు వచ్చినప్పటికీ ఆమె ఈ యాత్రకు దూరంగా ఉన్నారు.
కుదిరిన సీట్ల సర్దుబాటు
అయితే ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ - సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరాక కొన్ని రోజులకే అఖిలేష్ ఈ యాత్రలో పాల్గొనడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎస్పీ అంగికరించింది. ఇక ఎస్పీ 63 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇదిలాఉండగా.. 2019 మాదిరిగానే.. ఈసారి కూడా ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి దేశ ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: నేను సీబీఐ విచారణకు రాను.. కవిత షాకింగ్ రిప్లై