నిన్న రాత్రి కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ఘటన అక్కడి వారికి నిద్రలేకుండా చేసింది. ఆదోని వాలంటీర్ హరిబాబు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు అతనిని రాళ్ళతో కొట్టి చంపారు. మత్యకు గురైన హరిబాబు మండిగిర సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్నారు. తలకు బలమైన గాయం తగలడంతో హరిబాబు అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.
రాజీవ్ గాంధీ గాంధీ నగర్ లో వాలంటీర్ హరిబాబు నివాసం ఉంటున్నారుజ బుధవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన హరిబాబు ఎంతకూ తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వారు కూడా బయటకు వెళ్ళి పరిశీలించగా ఇంటికి కొంత దూరంలో నేల మీద రక్తపు మడుగులో చనిపోయిన హరిబాబు కనిపించారు. అతనిని రాళ్ళతో తల మీద కొట్టడం వల్లనే చనిపోయాడని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ఆదోని పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఆదోని డీఎస్పీ నారాయణ స్వామి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరిబాబు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హరిబాబు మృతి వెనుక ప్రేమ వ్యవహారం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి ఫోన్ రావడం, అతను బయటకు వెళ్ళడం అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అంటున్నారు. మృతుడి ఫోన్ ను కూడా పోలీసులు అతను చనిపోయిన ప్రదేశానికి పక్కనే ఉన్న తుప్పల్లో కనుగొన్నారు. అయితే హరిబాబును ఇంత దారుణంగా ఎవరు కొట్టి చంపారనేది మాత్రం తెలియడం లేదు.