మితిమీరిన వేగం ఒకరి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. మరో ఐదుగురిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. తాడేపల్లిగూడెం పెడతాడేపల్లి కమ్మ కళ్యాణ మండం వద్ద గత రాత్రి భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి వున్న లారీని వెనుక నుంచి స్విఫ్ట్ కారు ఒకటి ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఉన్నవారంతా తాడేపల్లిగూడెం నిట్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.
Also Read:మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు
కారు వేగంగా నడపడమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. దానికి తోడు కారులో ఉన్న విద్యార్ధులు తాగి ఉన్నారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హైవే పై ఆగి వున్న లారీని చూడకుండా గుద్దడంతో కారు ఏకంగా అవతలి వైపుకు ఎగిరి వెళ్ళి మరీ పడింది. ఎగరడం, బోల్తా పడడం వలన ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. యాక్సిడెంట్ జరిగిన సమయం రాత్రికి కూడా కావడం ఒక కారణం అయి ఉండొచ్చని అంటున్నారు. సాధారణంగా హైవే మీద ఉన్న వెహికల్స్ పార్కింగ్ లైట్స్ ఆన్ చేయకపోతే వెనుక వస్తున్నవారు వాటిని గమనించడం కష్టం అవుతుంది. ఒకవేళ గమనించినా స్పీడ్ ను కంట్రోల్ చేసే లోపుల యాక్సిడెంట్ జరిగిపోతుంది.
ఇక కారులో ఉన్న విద్యార్ధులు పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో భాగంగా పార్టీ చేసుకోవడం కోసం వెళ్తున్నట్టు తెలుస్తోంది. కారులో మద్యం బాటిళ్ళు, బాణసంచా లభ్యం అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. ఈ యాక్సిడెంట్ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన విద్యార్ధులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.
Also Read:వరుణ్-లావణ్యల పెళ్ళికి గెస్ట్ లుగా నాగచైతన్య, సమంత