Israel Bomb Blast in Gaza Hospital: గాజాలో దారుణం జరిగింది. పది రోజులగా ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం (Israel Hamas war)జరుగుతోంది. ఇందులో సామాన్యపౌరులు సైతం ప్రాణాలు విడుస్తున్నారు. వేలల్లోనే ఈ సంఖ్య ఉంది కూడా. ఇప్పుడు అంతకంటే ఘోరం జరిగింది. గాజాలో ఆసుపత్రి మీద బాంబు దాడి జరగడంతో 500 మంది అక్కడిక్కడే మరణించారు. గాజాలోని అల్ అహ్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరిగిన గొడవల్లో, దాడుల్లో ఇదే పెద్దది. ఇక ఉత్తర గాజాలో దాడులు చేస్తాం...అక్కడ ప్రాంతాన్ని ఖాళీ చేయండి అని చెప్పిన ఇజ్రాయెల్ దక్షిణ గాజాలో కూడా దాడులు చేస్తోంది. నిన్న జరిగిన దాడుల్లో దక్షిణ గాజాలో పదుల సంఖ్యలో పాలస్తీనావాసులు మరణించారు.
Also Read:మొన్న ఇంగ్లండ్, నిన్న సౌత్ ఆఫ్రికా…పసికూనలు అదరగొడుతున్నాయి.
ఆసుపత్రి మీద ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడం వల్లనే మరణాలు సంభవించినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు చెప్పారు. అయితే ఇజ్రాయెల్ (Israel) సైన్యం మాత్రం పాలస్తీనా (Palestine) మిలిటెంట్ గ్రూప్ చేసిన రాకెట్ ప్రయోగం విఫలమైందని చెబుతోంది. ఈ ఘటనకు సంబంధించి తమ వద్ద ఏ సమాచారం లేదని ఇజ్రాయెలీ మిలిటరీ అధికార ప్రతినిధి వెల్లడించారు. వైమానిక దాడి జరిగిందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండించింది. సామాన్య పౌరుల రక్షణకు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈజిప్ట్, కెనడా కూడా ఈ దారుణాన్ని ఖండించాయి.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గాజాకు మానవతా సాయం అందించేందుకు సహకరించాలని కోరుతూ రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. ఈరోజు ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్నారు.
ఇజ్రాయెల్ అన్ని వైపులా గాజాను చుట్టుముట్టేసింది. వరుసపెట్టి దాడులు చేస్తూనే ఉంది. రఫా, ఖాన్ యూనిస్ పట్టణాల సరిహద్దుల్లో దాడుల నిర్వహించింది. వీటిల్లో రఫాలో 27 మంది, ఖాన్ యూనిస్ లో 30 మంది మరణించారని అక్కడి ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. అలాగే డెయిర్ అల్ బలా లో కూడా దాడి చేయగా అక్కడ 11 మంది మృతి చెందారు. లెబనాన్ సరిహద్దుల్లో కూడా హెజ్బుల్లా సంస్థతో పోరాటం చేస్తోంది.