గాజాలో భీభత్సం సృష్టిస్తోంది ఇజ్రాయెల్. రోజూ వైమానిక దాడులతో అల్లకల్లోలం చేస్తోంది. దీంతో పాటూ యుద్ధ ట్యాంకర్లు, సైన్యం తో భూ దాడులకు కూడా సిద్ధమైపోయింది. చిన్నచిన్నగా సైన్యాన్ని గాజాలోకి పంపిస్తోంది. హమాస్ ను అంతం చేసే వరకు ఊరుకునేదే లేదు అంటోంది ఇజ్రాయెల్. హమాస్ కూడా దీనికి తగ్గట్టే ఉంది. వారు కూడా బందీలను విడిచిపెట్టడం లేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 7,028 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఇందులో 3 వేల మందికి పైగా పిల్లలు ఉన్నారు. దాడులతో గాజాలో పరిస్థితి దారుణంగా ఉంది. శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.
గాజాలో సామాన్యుల పరిస్థితి దారుణంగా మారింది. రోజూ భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. తమ వారిని పోగొట్టుకుని.. వారి శవాలను వెతుక్కోవడానికి వెళ్తే.. తాము కూడా ఎక్కడ చనిపోతామో అన్న భయంతో గడుపుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ఏ బందీల కోసం అయితే దాడులు జరుపుతోందో.. వారే ఈ దాడుల్లో చనిపోతున్నారు. ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్న ఈజిప్టును మిసైల్ ఒకటి తాకిందని....ఈ ఘటనలో 50 మంది బందీలు చనిపోయారని హమాస్ ప్రకటించింది. ఇది ఇజ్రాయెల్ ను భయపెట్టడానికా...లేకపోతే నిజంగా బందీలు చనిపోయారా అన్నది క్లారిటీగా తెలియాల్సి ఉంది. మరోవైపు గాజా వెస్ట్ బ్యాంక్ లో జరిపిన దాడుల్లో 60 మంది పాలస్తీనియన్లను అరెస్ట్ చేసింది ఇజ్రాయెల్ సైన్యం. అలాగే తూర్పు జెరూసలెంతో వేరేగా జరిపిన దాడుల్లో మరింత మంది అరెస్ట్ అయినట్లు అల్ జజీరా తెలిపింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు ఆగకపోవడం మీద అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ భూదాడులకు దిగితే తాము యుద్ధంలోకి ఎంటర్ అవుతామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇందులో లెబనాన్, సిరియాలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. పాలస్తీనా ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. వారి ప్రాణాలు రక్షించేందుకు అవరసమైన వాటిని సరఫరా చేసేందుకు అనుమతించాలని ఒత్తిడి తెస్తున్నాయి.