ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైయస్ జగన్‌కు ఇస్తారా? ఇవ్వరా? రాష్ట్రంలో ఇప్పుడు ఈ టాపిక్ గురించే చర్చ నడుస్తోంది . ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ద్వారా తమ పార్టీ హక్కులను దెబ్బతీయడమేనని జగన్ తాను రాసిన లేఖలో ఆరోపించడం కాక రేపుతోంది. అసలు ప్రతిపక్ష హోదాకు పది శాతం సీట్లు ఉండాలన్న నిబంధనేమీ లేదని జగన్ రాసుకొచ్చారు. ఇంతకీ జగన్ చెప్పినదాంట్లో నిజమెంతా? ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి 10శాతం సీట్లు అవసరం లేదా? ఇప్పుడు తెలుసుకుందాం!
నిజానికి ప్రధాన ప్రతిపక్షం గురించి రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావన లేదు. అదే సమయంలో పదో వంతు సీట్ల ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. రాజ్యాంగంలో అసలు ప్రతిపక్షం గురించే ప్రస్తావనే లేదు. అయితే సభ్యులకు సీట్లు కేటాయించడానికి మాత్రమే ఈ వెసులుబాటును ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. సభ్యులకు సీట్లు కేటాయించడానికి ఈ విధానాన్ని వినియోగించుకున్నారు. పదోవంతకు పైన స్థానాలు వచ్చిన పార్టీలను ముందు వరసలో సీట్లు కేటాయించేవారు. మిగిలిన వారిని అసలు పార్టీలుగా గుర్తించకుండా గ్రూపులుగా పరిగణించేవారు.
Also Read: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..
అయితే ప్రధాన ప్రతిపక్ష నేతను గుర్తించాల్సిన బాధ్యత స్పీకర్ పైనే ఉంది. దానికి ముందుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీని గుర్తించాల్సి ఉంటుంది. అది స్పీకర్ విచక్షణ పైనే ఆధారపడి ఉంది. పార్లమెంటు కానీ, శాసనసభ కానీ సభలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఎక్కువ స్థానాలున్న పార్టీకి ప్రతిపక్ష హోదా లభించాల్సి ఉంటుంది. అంటే ఆ పార్టీకి సంబంధించిన లీడర్‌ను ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాలుగు పార్టీలే ఉన్నాయి. అవి టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ. ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడి పొత్తు పెట్టుకుని విజయం సాధించాయి. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
నిజానికి పది శాతం సీట్లు రాకున్నా ప్రతిపక్ష హోదా అనుభవించడం గతంలోనూ అనేకసార్లు జరిగింది. 1984లో తెలుగుదేశం పార్టీ 30ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 543 సీట్లున్న లోక్‌సభలో కాంగ్రెస్ ఏకంగా 400కు పైగా సీట్లు సాధించింది. ఇటు టీడీపీ కంటే మిగిలిన పార్టీలన్ని తక్కువ సీట్లే గెలిచాయి. ఇక 543లో పది శాతం అంటే 55 సీట్లు కనీసం గెలవాల్సి ఉంటుంది. అయితే రెండో అతి పెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి ఆ నాడు ప్రతిపక్ష హోదా దక్కింది.
Also Read: ఏపీలో వాలంటీర్లకు ఊహించని షాక్
అటు పార్లమెంట్‌లోనే కాదు ఇటు రాష్ట్ర అసెంబ్లీలోనూ ఇలాంటి పరిణామమే ఓ సారి చోటుచేసుకుంది. 1994లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించింది. నాడు 294 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ కేవలం 26 సీట్లే గెలుచుకుంది. 10శాతం సీట్లు సాధించకపోయినా నాడు జనార్థన్‌రెడ్డికి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. ఇక 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మి పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది. 70 సీట్లలో ఏకంగా 67 సీట్లు సాధించింది. బీజేపీ మూడు స్థానాలకే పరిమితమైంది. అయినా కూడా లీడర్ ఆఫ్ అపొజిషన్‌ను గుర్తించింది ఢిల్లీ అసెంబ్లీ. ముందుగా చెప్పినట్టుగానే ఇదంతా స్పీకర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కానీ రూల్ ప్రకారం చూస్తే పది శాతం సీట్లు రావాలన్న నిబంధనమీ లేదు. ఇదే విషయాన్ని జగన్ లేవనెత్తారు. చట్టంలో 10శాతం నిబంధన ఎక్కడా లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకివ్వరని వైసీపీ ప్రశ్నిస్తోంది.