Telangana: రేవంత్ రెడ్డి నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే! బీసీ రిజర్వేషన్లు పెంచాకే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వివిధ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా ఎన్నికల తర్వాత పెంచుతారా? లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. By B Aravind 01 Sep 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి చెప్పిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగానే ఎలాంటి మార్పులు లేకుండా పంచాయతీ ఓటర్ల జాబితాను వార్డుల వారీగా తయారు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ 6న ముసాయిదా జాబితాను గ్రామపంచాయతీల్లో ప్రకటిస్తామని చెప్పారు. ఇక 7 నుంచి 13వ తేదీవరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి.. 19వ తేదీ లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సెప్టెంబర్ 31 గ్రామ పంచయాతీ తుది ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఓటరు ముసాయిదా జాబితాలో ఏవైనా లోపాలు ఉంటే.. అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అయితే అక్టోబర్ చివరన లేదా నవంబర్ మొదటివారంలో పంచయాతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి రిజర్వేషన్లు మారుతాయి ఈసారి జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) రాజకీయ పార్టీలకు వివరించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు టర్మ్‌ల వరకు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు మారకుండా చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం రిజర్వేషన్లు మారుతాయని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కొత్త ఓటర్ల జాబితాకు అనుగుణంగా ఈ రిజర్వేషన్లు మారుతాయని.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సామాజిక వర్గాల రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదనే విషయంలో స్పష్టత ఉన్నట్లు పేర్కొంది. అలాగే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు అంశం రాష్ట్ర పరిధిలోనిదని.. ప్రభుత్వపరంగా ఇచ్చే రిజర్వేషన్లనే తాము అమలు చేస్తామని ఎస్ఈసీ చెప్పింది. Also Read: రేపు విద్యాసంస్థలకు సెలవు.. అప్పటి వరకు బయటకు రావొద్దు: మంత్రి పొంగులేటి తెలంగాణలో 12,966 గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని 1,14,60 వార్డుల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. అయితే పోలింగ్ స్టేషన్లు కిలోమీటర్ పరిధిలో ఉండేలా చూసుకోవాలని ఓటర్ల లిస్టును గ్రామపంచాయతీలో వార్డులుగా విభజించేటప్పుడు ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే వార్డులో వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించారు. బీసీ రిజర్వేషన్ల పరిస్థితి ఏంటి ? ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చాక కులగణన చేస్తామని, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ కూడా ఎన్నికల ప్రచారంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కానీ ఇంతవరకు ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వివిధ పార్టీల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, లెఫ్ట్, ఎంఐఎం పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను ఎస్ఈసీకి వెల్లడించారు. సీఎం రేవంత్‌కు సవాల్ ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల అంశం సీఎం రేవంత్‌కు సవాలుగా మారింది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్లు పెంచుతారా లేదా ఎన్నికల తర్వాత పెంచుతారా అన్నది తేలాల్సి ఉంది. రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికలకు వెళ్తే ప్రతిపక్షాలు దీన్ని అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది. సొంత పార్టీలో కూడా కొందరు బీసీ నేతలు ఈ అంశంపై రేవంత్ ను ఇరుకున పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఒక వేళ రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తే.. ఎన్నికలకు మరో ఏడాదైనా పట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్తారనే అంశం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ రెండు అంశాలు కాకుండా ప్రత్యామ్నాయ మార్గం కోసం రేవంత్ అన్వేషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆ పార్టీ నేత కొదండరెడ్డి తెలిపారు. అయితే కుల గణన అనేది ప్రభుత్వం వల్ల అయ్యే పనికాదని.. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీల సహకారం కావాలని అన్నారు. Also Read: హైడ్రా పరుగులు.. మెరుపు వేగంతో కూల్చివేతలు! గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా నిర్ణయిస్తారు ? గ్రామ పంచాయతీల్లో రోస్టర్ విధానంలో ఎన్నికల రిజర్వేషన్లు నిర్ణయిస్తారు. ప్రతీ ఐదేళ్లకొకసారి సామాజిక వర్గాల రిజర్వేషన్ మారుతుంటుంది. మండల స్థాయిలో పంచాయతీలకు రొటేషన్ పద్ధతిలో నిర్ణయిస్తారు. ఆయా సామాజిక వర్గాల జనాభాను అనుసరించి రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఎస్సీ సామాజిక వర్గానికి మహిళ/పురుష, ఎస్టీ మహిళ/పురుష, బీసీ మహిళ/పురుష, ఇతర కులాలు ఓసీ మహిళ/పురుష ఆధారంగా ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లు ఉంటాయి. మహిళకు కేటాయించిన స్థానాల్లో పురుషులు పోటీ చేయరాదు. కానీ పురుషులకు కేటాయించిన స్థానాల్లో మహిళలు కూడా పోటీ చేయొచ్చు. అంటే ఆ స్థానం జనరల్ కేటగిరికీ కిందకు వస్తుంది. ఇక ఎస్సీలకు కేటాయించిన స్థానాల్లో మిగిలిన సామాజిక వర్గాలు పోటీ చేయకూడదు. ఓసీ, బీసీ స్థానాల్లో మాత్రం ఎస్సీ, ఎస్టీలు పోటీ చేయొచ్చు. ఓసీ పురుషుల స్థానాల్లో ఓసీ మహిళలు కూడా పోటీ చేయొచ్చు. ఓసీ పురుషులు తమకు కేటాయించిన స్థానాలు తప్ప మిగిలిన వాటిలో పోటీ చేయరాదు. ఆయా వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఆ గ్రామంలో వారి సామజిక వర్గానికి సంబంధించి కనీసం ఒక్క ఓటు అయినా ఉండాలి. #panchayat-elections #telugu-news #cm-revanth #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి