ప్రజ్వల్ రేవణ్ణ.. సెక్స్ స్కాండల్...! ఈ రెండు పదాలు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వంద కాదు, ఏకంగా 3వేలకు పైగా అసభ్యకర వీడియోలను అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అమ్మాయిలతో అలాంటివి చేయడం.. దాన్ని వీడియో రికార్డ్ చేయడం.. తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం.. ఇది ప్రజ్వల్ రేవణ్ణ దినచర్యగా తెలుస్తోంది. ఈ స్కాండల్‌కు సెంటర్‌గా ఉన్న కర్ణాటకనే కాకుండా మొత్తం దేశ రాజకీయల్లోనే ఈ టాపిక్‌పై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేస్తూ యాంటీ కమలం పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇంతకీ ఎవరీ ప్రజ్వల్ రేవణ్ణ? మహిళలతో అశ్లీల వీడియోల వెనుక కథేంటి?
మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ అధ్యక్షుడు హెచ్‌డి దేవెగౌడ మనవడే ఈ ప్రజ్వల్. దేవెగౌడ పెద్ద కొడుకు పేరు రేవణ్ణ.. అతని కొడుకు ఈ ప్రజ్వల్. కర్ణాటకలోని హాసన్ నుంచి 2019లో ఎంపీగా ప్రజ్వల్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఏకైక JDS నాయకుడు ఇతనే. ఆ సమయంలో కుమారస్వామి నేతృత్వంలోని మంత్రివర్గంలో మినిస్టర్‌గా ఉన్నారు ప్రజ్వల్. దేశంలోని 3వ అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడుగా ప్రజ్వల్‌కు రికార్డు ఉంది. ఇక 2014లో బెంగుళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీర్‌గా పట్టభద్రుడయ్యారు. నవంబర్ 2019లో JDS రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
ప్రజ్వల్ చిక్కుల్లో పడటం ఇది తొలిసారి కాదు.. గతంలోనూ అనేక వివాదాల్లో అతని పేరు వినిపించింది. ఎంపీగా అనర్హత వేటు కూడా పడింది. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజ్వల్ ప్రత్యర్థి, బీజేపీ నేత మంజు భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రజ్వల్ తన ఆస్తుల వివరాలను పూర్తిగా పొందుపరచలేదని ఆరోపిస్తూ కంప్లైంట్ ఇచ్చారు. నాలుగు సంవత్సరాల విచారణ తర్వాత కర్ణాటక హైకోర్టు ప్రజ్వల్ తప్పు చేశారని తేల్చింది. లోక్‌సభ సభ్యుడిగా ప్రజ్వల్‌ను అనర్హుడిగా ప్రకటించింది. ఆ తర్వాత ప్రజ్వల్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. అయితే సుప్రీంకోర్టులోనూ ప్రజ్వల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు అతని అనర్హతపై స్టే విధించింది. కేసును తిరిగి కర్ణాటక హైకోర్టుకే రిఫర్ చేసింది.
అసలు ప్రజ్వల్‌ను పక్కన పెట్టాలన్న వాదన సొంతపార్టీతో పాటు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నుంచి కూడా గట్టిగా వినిపిస్తోంది. అయితే ప్రజ్వల్ తాత దేవెగౌడ మాత్రం ప్రజ్వల్‌కి సపోర్ట్‌గా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజ్వల్ ఇంటి పనిమనిషి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అతని లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రజ్వల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పని మనిషి ఆరోపిస్తున్నారు. బాధితురాలి భర్త ప్రజ్వల్‌కు చెందిన పాల డెయిరీలోనే పనిచేస్తున్నాడు. బాధితురాలు అతనికి బంధువు వరుస కూడా అవుతుందని సమాచారం.
2019లో ప్రజ్వల్ సోదరుడు సూరజ్ పెళ్లి సందర్భంగా తనను పనికి పిలిచారని పనిమనిషి ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి ప్రజ్వల్ ఇంట్లోనే పనిచేస్తోంది. తనను రేవణ్ణ గదికి పిలిచేవారని ఆరోపిస్తోంది. అక్కడ మరో ఆరుగురు మహిళా ఉద్యోగులు ఉన్నారని.. వారంతా భయాందోళనకు గురవుతూంటారని చెబుతోంది. మహిళలు వంటగదిలో పని చేస్తున్నప్పుడు, ప్రజ్వల్ వచ్చి వారిని వెనుక నుంచి కౌగిలించుకొనేవాడట. వీడియో కాల్స్ చేసేవాడని, తన కూతురికి ఫోన్ చేసేవాడని పనిమనిషి చెప్పింది. అయితే అతని నంబర్‌ను ఆమె కూతురు బ్లాక్ చేసింది.
ప్రజ్వల్ ఎపిసోడ్‌తో కర్ణాటకలో రాజకీయ దుమారం మొదలైంది. ఈ వివాదం జేడీఎస్-బీజేపీ మధ్య రాజకీయ పోరుగా కూడా మారింది. ఈ సెక్స్ టేప్ వివాదంలో బీజేపీ ఆచితూచి స్పందిస్తోంది. 2023 డిసెంబర్‌లో 3,000 పైగా అశ్లీల వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ తన వద్దకు వచ్చిన్నట్టు బీజేపీ నేత దేవరాజేగౌడ చెబుతున్నారు. ఈ వీడియో క్లిప్‌ల ద్వారా మహిళలు బ్లాక్‌మెయిల్‌కు గురవుతున్నారంటున్నారు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి వరుస పెట్టి ప్రజ్వల్ గురించి అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రజ్వల్ పేరు రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల్లోనూ మారుమోగుతోంది.