MLC Kavitha Charge Sheet: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం (Delhi Liquor Scam) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందుగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా, ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మనీస్ సిసోడియా ఇటీవల జైలు నుంచి విడుదల కాగా.. తాజాగా మంగళవారం కవిత కూడా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు ఆమెకు షరతులో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్‌లో కవితను ఈడీ అరెస్టు చేసింది. అప్పటినుంచి ఆమె తీహార్ జైల్లోనే ఉన్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2022 జులైలో లిక్కర్ స్కామ్ బయటపడింది. దాదాపు ఐదు నెలల తర్వాత డిసెంబర్‌లో మొదటిసారిగా సీబీఐ కవితను విచారించింది. ఆ తర్వాత 2023 మార్చి 11న ఈడీ కూడా కవితను విచారించింది. చివరికి మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. ఆ తర్వాత 16, 20, 21 తేదీల్లో ఢిల్లీలో ఆమెను విచారించారు. కవిత తన వద్ద ఉన్న ఫోన్లను ఈడీ అధికారులకు అందజేసింది. అయితే అంతకుముందే ఈడీ పలుమార్లు కవిత పేరును ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీటులో ప్రస్తావించింది.
ఛార్జిషీటులో కవితపై అభియోగాలు ఏంటి
2022 నవంబర్ 26న లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న సమీర్ మహేంద్ర అతడికి సంబంధించిన నాలుగు కంపెనీలపై మొదటిసారిగా ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగిన అవకతవకలు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలను ఈడీ పేర్కొంది. ఇందులో కవిత పేరును కూడా ప్రస్తావించింది. ఆ తర్వాత డిసెంబర్‌లో కూడా కవిత మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో సమీర్ మహేంద్రపైన ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో కీలక విషయాలు వెల్లడించింది. మరోసారి కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఛార్జీషీటులో ప్రస్తావించింది.
సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్‌లో కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు మాగుంట రాఘవరెడ్డి, మూత్తం గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్ రావు పేర్లు కూడా ఉన్నాయి. సమీర్‌కు చెందిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవితకు 32 శాతం వాటా ఉన్నట్లు ఈడీ అభియోగం మోపింది. ఎల్-1 లైసైన్స్ కింద వచ్చిన షాపుల్లో కవితకు ఈ వాటా ఉందని తెలిపింది. ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన మీటింగ్‌లో కవిత, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా, విజయ్‌నాయర్ పాల్గొన్నట్లు చెప్పింది. ఇండో స్పిరిట్‌ను కవిత వెనకుండి నడిపించారని.. ఈ కంపెనీలో నిజమైన భాగస్వాములు కవిత, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి అని ఈడీ చార్జ్‌షీట్‌లో వెల్లడించింది.
ఆ తర్వాత 2023 మార్చిలో కవిత అరెస్టయ్యాక మే నెలలో కూడా ఈడీ ఆమెపై ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇందులో కవిత పేరుతో పాటు ఇదే కేసుతో సంబంధం ఉన్న దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, ఛన్‌ప్రీత్ సింగ్, అరవింద్ సింగ్ పేర్లను కూడా ఈ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. అప్పటివరకు జరిగిన ఈ కేసుకు సంబంధించిన విచారణ వివరాలను అందులో వివరించారు. అయితే 2022 నాటి గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరఫున కవిత ప్రచార వ్యవహారాలు, దానికి అయ్యే ఖర్చును హ్యాండిల్ చేశారని ఈడీ అధికారులు ఛార్జిషీట్‌లో వెల్లడించారు. ఆ మొత్తం డబ్బంతా అక్రమంగా ఆర్జించిందేనని తెలిపారు. ఈ కేసులో మొత్తం రూ.100 కోట్ల స్కామ్ జరిగిందని తేల్చిచెప్పారు.
కవితకు బెయిల్ రావడానికి కారణం
ఇదిలాఉండగా కవిత బెయిల్‌కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఆమె పిటిషన్ విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. చివరికి ఆగస్టు 27న సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆమె పిటిషన్‌పై విచారణ చేసింది. ఈ కేసులో తుది ఛార్జిషీటు దాఖలు చేయడం పూర్తికావడం, కవితపై విచారణ పూర్తి కావడం లాంటి అంశాలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. అలాగే PMLAలో సెక్షన్ 44 కూడా కవితకు వర్తిస్తుందని అభిప్రాయపడింది. చివరికి సీబీఐ, ఈడీ.. ఈ రెండు కేసుల్లో రూ.10 లక్షల చొప్పున పూచికత్తు సమర్పించాలని, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది.