Children Milk: పాలలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. పిల్లలకు పాలు తాగించడం వల్ల ఎదుగుదల బాగుంటుంది. అనేక రోగాల బారి నుంచి వారిని కాపాడ వచ్చు. కానీ అన్ని వయసుల పిల్లలకు ఒకే రకమైన పాలు సరిపోవు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు పాలు ఇచ్చే విషయంలో కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి.
0 నుంచి 6 నెలలు:
- ఈ వయస్సులో పిల్లలకు తల్లి పాలు ఉత్తమమైనవని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వీటిలో అనేక పోషకాలు, ప్రతిరోధకాలు ఉంటాయి. తల్లి పాలు అందుబాటులో లేకుంటే వైద్యుల సలహా మేరకు ఇతర ప్రత్యామ్నాయాలు చూడవచ్చు. 6 నెలల నుంచి సంవత్సరం వయసు వరకు కూడా తల్లి పాలతో పాటు ఏదైనా ఘన ఆహారాన్ని అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
1 నుంచి 2 సంవత్సరాలు:
- ఏడాది వయసు తర్వాత పిల్లలకు కొవ్వు ఉన్న పాలు ఇవ్వొచ్చు. ఇందులో ఉండే కొవ్వు వారి మానసిక, శారీరక అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకి లాక్టోస్ అసహనం లేదా ఏదైనా ఇతర అలెర్జీ ఉంటే వారికి ఇతర పాలు ఇవ్వవచ్చని నిపుణులు అంటున్నారు.
2 సంవత్సరాల తర్వాత:
- స్కిమ్డ్ లేదా తక్కువ కొవ్వు పాలు 2 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు ఇవ్వొచ్చు. దీని వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
పాల అలెర్జీ ఉంటే?
- పిల్లలకు లాక్టోస్ అసహనం లేదా పాల అలెర్జీ ఉంటే బాదం పాలు, సోయా పాలు లేదా ఓట్ పాలు అందించవచ్చు. పిల్లల ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు పిల్లల డాక్టర్‌ను మాత్రం కచ్చితంగా సంప్రదించాలి.
ఆవు లేదా గేదె పాలు:
- ఆవు, గేదె పాలు రెండూ పిల్లలకు పోషకాలు ఇస్తాయి. కానీ రెండింటి పోషక విలువలలో కొంత వ్యత్యాసం ఉంటుంది. ఆవు పాలలో ప్రొటీన్లు, విటమిన్ బి-12 అధికంగా ఉంటాయి. సులభంగా జీర్ణమవుతాయి. అందుకే ఇవి చిన్నారులకు చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా వీటిలో తక్కువ మొత్తంలో లాక్టోస్ ఉంటుంది. ఈ లాక్టోస్ సెన్సిటివిటీ ఉన్న పిల్లలకు మంచిది. గేదె పాలలో కాల్షియం, పొటాషియం, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి పెరుగుతున్న పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: తల్లిదండ్రుల ఆరోగ్యంపై పిల్లల హోంవర్క్ ప్రభావం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.