Rain Alert :
పశ్చిమ -మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రంగా కొనసాగిన వాయుగుండం…పూరీకి సమీపంలో ఒడిశా తీరాన్ని దాటినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. కరీంనగర్, ములుగు, పెద్దపల్లి , ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు పేర్కొన్నారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి పూరీ వద్ద తీరం దాటిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.