విపక్ష ‘ఇండియా’ కూటమి నిర్వహించే మూడవ సమావేశానికి ఆప్ నేతలు హాజరవుతారా? లేదా అనే అనుమానాలకు తెరపడింది. ముంబైలో నిర్వహించబోయే సమావేశానికి తాము హాజరవుతామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. తాము ముంబైకి వెళ్తామని, తమ వ్యూహమేంటో తెలియజేస్తామని మీడియాతో ఆయన అన్నారు.
ఢిల్లీలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తామే పోటీ చేస్తామని కాంగ్రెస్ నేతలు అన్నారు. దీంతో కాంగ్రెస్, ఆప్ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అన్ని స్థానాల్లో కాంగ్రెస్ నేతలే పోటీ చేస్తే ఇక తాము కూటమి సమావేశాలకు రావడం ఎందుకని ఆప్ నేతలు పెదవి విరిచారు. విపక్ష ఇండియా కూటమి సమావేశాలకు హాజరు కాకుంటేనే మంచిదని కేజ్రీవాల్ తో ఆప్ నేతలు అన్నట్టు సమాచారం.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు కొంత మెత్తపడ్డారు. ఢిల్లీలో పోటీ చేసే అంశంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అసలు అలాంటి చర్చ ఇంకా జరగలేదన్నారు. ఢిల్లీలో పోటీపై అధిష్టానమే ప్రకటన చేస్తుందని అన్నారు. దీంతో ఆప్ నేతలు కొంత శాంతించినట్టు కనిపించారు. తాజాగా సమావేశానికి హాజరవుతామని కేజ్రీవాల్ ప్రకటించడంతో ఇరు పార్టీల మధ్య వివాదం సద్దుమణిగింది.
మూడవ సమావేశాన్ని ముంబైలో అగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు నిర్వహించనున్నారు. బెంగళూరు సమావేశం నిర్వహించిన ఫార్మాట్ లోనే ఈ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నట్టు కూటమి శ్రేణులు తెలిపాయి. ఈ సమావేశంలో పార్టీలు తమ విభేదాలను వీలైనంత వరకు పరిష్కరించుకోవాలని భావిస్తున్నాయి. ఈ సమావేశానికి శివసేన(యూబీటీ), నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
అంతకు ముందు విపక్ష కూటమి మొదటి సమావేశాన్ని బిహార్ రాజధాని పాట్నాలో నిర్వహించారు. ఈ సమావేశ ఏర్పాటులో బిహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇక రెండవ సమావేశాన్ని బెంగళూరులో నిర్వహించారు. ఈ సమావేశంలోనే విపక్ష కూటమి పేరును ‘ఇండియా’గా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.