భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేశాయి. వరంగల్ భద్రకాళి చెరువుకు వరద పోటెత్తింది. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం మాత్రం తగ్గడం లేదు. భారీవరద కారణంగా భద్రకాళి చెరువుకు గండి పడింది. భద్రకాళి చెరువుకు ఒక్కసారిగా గండిపడడంతో పోతన నగర్, సరస్వతి నగర్‌కు ప్రమాదం పొంచి ఉంది. ఆయా కాలనీలో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. వరద ఫ్లో ఎక్కువైతే ఆయా కాలనీలు నీటిలో పూర్తిగా మునిగిపోతాయని స్థానికులు వాపోతున్నారు. కాలనీవాసులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి అనుచరులు అయినటువంటి పురుషోత్తం,అనిల్‌ను పోలీసులు చితకబాదారు. బాధిత ప్రజలను కలుసుకోవడం వారికి సహయం చేయడంలో ఉన్న తప్పేంటి? అంటూ పోలీసులతో రాకేష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడం కూడా నేరమా? అంటూ పోలీసులను ప్రశ్నించారు.
దీని కారణంగా కుంటలు, చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని చెరువుల సామర్ధ్యం మించి వరద వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్‌లోని భద్రకాళి చెరువుకు గండిపడడం ప్రజలకు టెన్షన్ కు గురి చేస్తుంది. వరద ఉధృతికి పోతన్ నగర్ వైపు చెరువు కట్ట కోతకు గురై నీరు గండి గుండా బయటకు వెళ్ళిపోతుంది. దీంతో పోతన్‌నగర్, సరస్వతి నగర్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక గండిని పూడ్చడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సిమెంట్ బస్తాలతో గండిని పూడ్చేందుకు శ్రమిస్తున్నారు.
పోతననగర్, సరస్వతీ నగర్ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మిగతా అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలపై దృష్టి సారించారు. తెలంగాణలో వర్షాలు మామూలుగా లేవు. గతవారం రోజులుగా కురిసిన వాన ఒకెత్తయితే బుధవారం రాత్రి కురిసిన వాన మరోఎత్తు. ఎందుకంటే ఈ వర్షం ధాటికి రాత్రికి రాత్రే కుంటలు, చెరువులు నిండిపోయాయి. ఇక వరదల ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం ఎల్లదీస్తున్నారు. ఇక రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతం ములుగు జిల్లాలో నమోదు అయింది. గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో ఏకంగా 649.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ప్రస్తుతానికి వర్షాలు తగ్గినా వరద ప్రభావం మాత్రం అంతకంతకు పెరుగుతూ పట్టణాలను మాత్రం జలదిగ్బందంలోనే కాలాన్ని వెల్లదీస్తున్నారు.