Delhi IAS Coaching Centre Tragedy: ఢిల్లీలోని రావుస్ స్టడీ సర్కిల్ (Rau's IAS Study Circle) బెస్‌మెంట్‌లోకి వరదలు రావడంతో ముగ్గురు విద్యార్థులు చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ దుర్ఘటనలో తానియా సోనీ, శ్రేయా యాదవ్, వెవిస్ డాల్వన్ ప్రాణాలు కోల్పోయారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని అక్కడ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు నిరసనలు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. కౌన్సిలర్, ఇతర ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
సోమవారం బీజేపీ శ్రేణులు, నేతలు ఆప్ కార్యాలయానికి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ విషాద ఘటనపై ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ శ్రేణులను వాటర్ కెనన్స్‌తో చెదరగొట్టారు. ఇదిలాఉండగా.. ప్రమాదానికి ముందు రావుస్ స్టడీ సర్కిల్‌లో తీసిన విజువల్స్ వైరలవుతున్నాయి. బెస్‌మెంట్‌లోకి వరద నీరు రావడంతో అందులో ఉన్న విద్యార్థులు నీటిలో నుంచి మెట్ల మీదుగా బయటకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు విద్యార్థులు బయటకు వచ్చే లోపే వరద పోటెత్తి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: 88 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు అరెస్ట్!
చట్టవిరుద్ధంగా కోచింగ్ సెంటర్లు నడుపుతున్న ఇలాంటి స్టడీ సెంటర్ల యజమానులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో అక్రమంగా నడిపిస్తున్న 13 కోచింగ్ సెంటర్లను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ వేశారు. రూల్స్‌కు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు నిర్వహించడం వల్లే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కో ఆర్టినేటర్ దేశ్‌పాల్ సింగ్‌లను అరెస్టు చేశారు. వారికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే ఈ ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్‌ను స్టోర్ రూమ్, పార్కింగ్‌కు కేటాయిస్తామని చెప్పి దాన్ని లైబ్రరీగా వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ 18 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆ సెల్లార్‌లో మురుగునీరు బయటకు వెళ్లే సిస్టమ్ కూడా లేదని చెప్పారు.
Also Read: బెంగళూరు కుక్క మాంసం ఘటనలో ట్విస్ట్.. ఫుడ్ అధికారులు చెప్పింది వింటే ఫీజులు ఎగిరిపోతాయి!