/rtv/media/media_files/2026/01/27/ambulance-2026-01-27-07-11-29.jpg)
ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్.. సాంకేతిక లోపంతో యమపాశంగా మారింది. అంబులెన్స్ తలుపులు రాకపోవడంతో రోగి లోపలే చిక్కుకుపోయి, చివరికి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో వెలుగుచూసింది. రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల రామ్ ప్రసాద్ శనివారం ఉదయం చలి కాచుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సత్నా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
Jeevandayini Turns Deadly: 108 Ambulance Door Jam Costs Heart Patient His Life in Satna pic.twitter.com/ETU3bepSD9
— The Times Patriot (@thetimespatriot) January 26, 2026
దీంతో బాధితుడిని ప్రభుత్వ అంబులెన్స్‌లో సత్నాకు తరలించారు. ఆసుపత్రికి చేరుకున్నాక అసలు కష్టం మొదలైంది. రోగిని బయటకు తీయడానికి అంబులెన్స్ వెనుక డోర్లు ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. డ్రైవర్‌తో పాటు అక్కడున్న వారు ఎంత బలంగా లాగినా తలుపులు జామ్ అయ్యాయి. ఒక వ్యక్తి కిటికీ గుండా లోపలికి వెళ్లి లోపలి నుండి తలుపులను తన్నాడు. సుమారు అరగంట పాటు రోగి నరకయాతన అనుభవించిన తర్వాత డోర్లు తెరుచుకున్నాయి.
వెంటనే ఆయనను స్ట్రెచర్‌పై డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే రామ్ ప్రసాద్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సకాలంలో తలుపులు తెరుచుకుని ఉంటే తన తండ్రి బతికేవాడని మృతుడి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ప్రభుత్వ వైద్య సేవలపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటనపై సత్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్పందించారు. అంబులెన్స్ నిర్వహణలో లోపాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వాహనాల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేయడంలో అధికారుల అలసత్వంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Follow Us