Vegetable Prices In Telugu States : రెండు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు (Vegetable Prices) చుక్కలను తాకుతున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) మందగమనం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చాలా తక్కువగా ఉండడంతో కూరగాయల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపించింది. ఫలితంగా రైతుబజార్లతో పోలిస్తే చిల్లర మారెట్‌లో ఏకంగా 60 శాతం వరకు ధరలు అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది
సాధారణంగా వేసవి (Summer) లో కూరగాయల ధరలు ఆకాశంటుతాయి. వర్షాకాలం మొదలవగానే రేట్లు తగ్గుతాయి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వేసవి సీజన్‌లో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. వర్షాకాలం మొదలయ్యాక, వర్షాభావ పరిస్థితుల వల్ల 20రోజుల వ్యవధిలోనే అమాంతంగా ధరలు పెరిగాయి.
ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్ మాసాల్లో అకాల వర్షాలు, వడగండ్లు, ఈదురు గాలులు కూరగాయలు, ఆకుకూరల తోటలను దెబ్బతీశాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్‌నగర్, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో కూరగాయల దిగుబడులు తగ్గడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్నారు. ఫలితంగా కూరగాయల ధరలపై రవాణా భారం కూడా పడుతుంది.