FDA Approves Chikungunya Vaccine: చికున్‌గున్యా వల్ల జ్వరాలు, కీళ్ల నొప్పులతో చాలామంది బాధపడుతుంటారు. అయితే ఇలాంటివారికి త్వరలోనే ఉపశమనం కలగనుంది. ప్రపచంలో మొదటిసారిగా యూరప్‌కు చెందిన వాల్నేవా అనే కంపెనీ చికున్‌గున్యా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అయితే ఈ టీకా వాడేందుకు అమెరికా ఆరోగ్య సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నుంచి కూడా ఆమోదం వచ్చేసింది. దోమల ద్వారా వ్యాపించే చికున్‌గున్యా వైరస్‌ను ఈ టీకా ద్వారా అడ్డుకోవచ్చని ఎఫ్‌డీఏ అధికారులు తెలిపారు. 18 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు దీనిని వినియోగించవచ్చని పేర్కొన్నారు. ఇక ఈ వైరస్ ప్రభావం ఉన్న దేశాల ప్రజలకు ఈ వ్యాక్సిన్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అయితే 'లిక్స్‌చిక్' అనే పేరుతో ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్లో విక్రయించనున్నారు.
Also read: ఈరోజు వరల్డ్ సైన్స్ డే.. దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా.. ?
జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులను కలిగించే ఈ చికున్‌గున్యా ముఖ్యంగా ఆఫ్రికా, ఆగ్నేయాసియా, అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. గత 15 ఏళ్లలో చూసుకుంటే దాదాపు 5 మిలియన్లకుపైగా రోగులు ఈ వ్యాధి బారిన పడ్డారు. అలాగే ఈ వైరస్ కొత్త భౌగోళిక ప్రాంతాలకు కూడా వ్యాపించిందని.. అందుకే ఇది ప్రపంచవ్యాప్త వ్యాధిగా పేరొందినట్లు ఎఫ్‌డీఏ అధికారులు తెలిపారు. అయితే ఈ చికున్‌గున్యా వైరస్ (Chikungunya Virus) తీవ్రమైన వ్యాధని.. ఇది సోకినవారిలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని పేర్కొన్నారు. ఈ వైరస్ వల్ల ముఖ్యంగా వృద్ధుల్లో ఎక్కవగా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు.
ఇక క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా నార్త్ అమెరికాలో 3,500 మందిపై ఈ వ్యాక్సిన్‌ను (Chikungunya Vaccine)పరీక్షించినట్లు వెల్లడించారు. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల తలనొప్పి, అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు, జ్వరం, వికారం లాంటి సాధారణ దుష్ప్రభావాలు వచ్చినట్లు అధికారులు చెప్పారు. కేవలం 1.6 శాతం మందిలో తీవ్రమైన దుష్ప్రభాబాలు కనిపించాయని.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని తెలిపారు.