/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/UN-1-jpg.webp)
ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలోని సామాన్య పౌరుల జీవితాలు ఆగమవుతున్నాయి. అక్కడ నివసిస్తున్న జనభాలో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారని యూఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (UNWFP) డిప్యూటీ డైరెక్టర్ కార్ల్ స్కౌ (Carl Skau) తెలిపారు. ఇప్పటికే ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల గాజాలో రోడ్లన్ని ధ్వంసమైపోయాయి. అయితే పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం అందించాలంటే ఒకే మార్గం ఉంది. అదే గాజా, ఈజిప్టు మధ్యనున్న రఫా సరిహద్దు మాత్రమే. ఇటీవల కాల్పుల విరమణ తర్వాత మళ్లీ దాడులు చోటుచేసుకున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ఐరాసాలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో అధికారంతో తిరస్కరించింది. దీంతో గాజాలో ఇజ్రాయెల్ దళాలు తమ దాడులను మరింత తీవ్రతరం చేశాయి. అలాగే గాజాలోని అన్ని సరిహద్దులను తమ అధీనంలోకి తీసుకున్నాయి. దీనివల్ల అక్కడి ప్రజలకు మానవతా సాయంలో భాగంగా అవసరమైన సామాగ్రిలో కొంత భాగం మాత్రమే అక్కడికి వెళ్తుందని.. సరిపడా ఆహారం లేక అక్కడి పౌరులు ఆకలి కేకలను ఎదుర్కొంటున్నారని కార్ల్ స్కౌ ఆందోళన వ్యక్తం చేశారు.
Also read: మహిళకు టికెట్ కొట్టిన కండక్టర్ ఘటన.. అసలు నిజం ఇదే..
తమ పరిశోధనల ప్రకారం.. రోజుకు పదిమందిలో తొమ్మిది మంది తీవ్ర ఆకలి బాధలను అనుభవిస్తున్నారని.. ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలు ఎగబడడాన్ని తమ బృందం చూసినట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో అంతర్జాతీయ ఒత్తిడి వల్ల గాజాకు కొంతమేర మానవతా సాయాన్ని అందించేందుకు ఇజ్రాయెల్ పర్మిషన్ ఇచ్చిందని చెప్పారు. కానీ ఆహారపు కొరతను తీర్చేందుకు మరో సరిహద్దును తెరవాలని సూచించారు. ఒకవేళ ఆలస్యం చేస్తే మరింత మంది ఆకలితో అలమటిస్తారని.. దీనివల్ల సమస్య తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ఇదిలాఉండగా.. గాజాలో దాడులు ఆపాలని ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడంతో.. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ స్పందించారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో అమెరికాకు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపణలు చేశారు.
Also read: బాలీవుడ్ హీరోలకు కేంద్రం నోటీసులు