ఇటీవల డీప్‌ఫేక్ వీడియోలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. సినినటులు రష్మిక మందన, కత్రినా కైఫ్, కాజోల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. చాలామంది వీటిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు మళ్లి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనిపై కొత్త నిబంధనలు తీసుకొస్తామని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇకనుంచి డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించేవారికి, అలాగే ఆ వీడియోల వ్యాప్తికి కారణమయ్యే సోషల్ మీడియాలకు భారీ జరిమాన విధించే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. డీప్‌ఫక్ వీడియోల కట్టడికి సంబంధించి కీలక సమావేశం నిర్వహించిన కేంద్రం.. సోషల్ మీడియా సంస్థలు, నాస్కామ్, అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌పై పనిచేసే నిపుణులతో చర్చలు జరిపింది. ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.. ప్రజాస్వామ్యానికి డీప్‌ఫేక్ ముప్పుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Also Read: శిరీషకు మద్ధతు ప్రకటించిన జానకీపురం సర్పంచ్ నవ్య.. కొల్లాపూర్‌కు పయనం..
డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించడం, వాటి వ్యాప్తిని కట్టడిచేయడం, వాటిని నివేదించడం, అవగాహన కల్పించడం లాంటి విషయాలపై చర్చలు జరిపామని పేర్కొన్నారు. రాబోయే కొన్ని వారాల్లో ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నామని.. ఆ ముసాయిదా రూపకల్పనను ఈరోజు నుంచే మొదలుపెడతామని అన్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలను సవరించడమో లేదా కొత్త చట్టం తీసుకురావడమో చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఈ అంశంపై డిసెంబరు తొలి వారంలో మరోసారి చర్చలు జరుపుతామని వెల్లడించారు.
Also Read: సీఎం పదవిపై భట్టి విక్రమార్క ఏమన్నారంటే!