Rain Alert in AP & TS: ఏపీలో గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి, పడమటి గాలుల ప్రభావంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతోపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. అయితే మరో రెండు రోజులు వానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఈనెల 29న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. అనంతరం అది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలపడి, తీవ్రతరమవుతుంది అధికారులు చెబుతున్నారు.
తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం
అయితే పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. పాలకొల్లు, నరసాపురం, భీమవరం ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. రహదారులన్ని జలమయమైనయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. అంతేకాకుండా పార్వతీపురం మన్యం, ప్రకాశం, విజయనగరం, శ్రీ సత్యసాయి జిల్లా, యానాం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో మాత్రం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా ఆదివారం (నిన్న) పార్వతీపురం మన్యం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది.
పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం
మరోవైపు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. కడపలో 86.4 మి.మీటర్లు, శ్రీసత్యసాయి జిల్లా నంబులిపులికుంటలో 76.2, నగరిలో 63.2, సాంబేపల్లిలో 37.2, ఆత్మకూరులో 36.2, శింగనమలలో 34.6, గరివిడిలో 68.2 మిల్లీ మీటర్లు, అనకాపల్లిలో 60.8, మిల్లీ మీటర్ల వాన పడింది. నేడు అనకాపల్లి, పార్వతీపురం మన్యం, ప్రకాశం, తూర్పుగోదావరి, కాకినాడ, పల్నాడు, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఙప్తి చేసింది. పలు రాష్ట్రాల్లో సెప్టెంబరు 27 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Also Read: నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు