Twitter War between Revanth Reddy and Kavitha: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల (Congress Party) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మూడో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ (BRS), ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఛాన్స్ దొరికినప్పుడల్లా నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా గులాబీ పార్టీ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల మధ్య ట్వీట్ వార్ జరిగింది.
రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన నేపథ్యంలో ఆయనను విమర్శిస్తూ కవిత ట్వీట్ చేశారు. "అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు ఢిల్లీ... కానీ ఇప్పుడు వయా బెంగళూరు.. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం... ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం.." అంటూ కవిత ట్విట్టర్‌లో విమర్శలు చేశారు.
కవిత ట్వీట్‌కు రేవంత్ అంతే ధీటుగా సమానధానమిచ్చారు. "గల్లీలో సవాళ్లు... ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోళ్లు... ఇది కేసీఆర్ మ్యాజిక్కు.. జగమెరిగిన 'నిక్కర్'...లిక్కర్... లాజిక్కు" అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎసీటీపీ అధ్యక్షురాలు వైఎష్ షర్మిల ఇటీవల ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆమె హైదరాబాద్ రాగానే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా బెంగళూరు వెళ్లారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయి తాజా రాజకీయాలపై చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్‌లోకి షర్మిల రాకను రేవంత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమెను పార్టీలో చేర్చుకుని ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై డీకేతో చర్చింనట్లు తెలుస్తోంది. అలాగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేసిన ప్రణాళికను తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన డీకే శివకుమార్‌కు తెలంగాణ ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రేవంత్ బెంగళూరు వెళ్లి డీకేతో భేటీ అయినట్లు హస్తం వర్గాలు చెబుతున్నాయి.
Also Read: బీజేపీ అభ్యర్థుల ఎంపిక షూరు.. దరఖాస్తులకు ఆహ్వానం