Child Care: ప్రస్తుత కాలంలో పిల్లలు పూర్తిగా మొబైల్, టీవీలకు బానిసలయ్యారు. టీవీ పెట్టకపోయినా, మొబైల్ ఫోన్‌లో తమకు ఇష్టమైన వీడియో ప్లే చేయకపోయినా తినబోమని మొండికేస్తున్నారు. అయితే పిల్లలు టీవీ చూస్తూ తినడం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను చూసుకునే విధానం వారి మొత్తం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు సమతుల్య పోషకాహారాన్ని అందించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం, పిల్లల శారీరక ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. పిల్లలతో మంచి సంబంధాలు ఏర్పర్చుకోవడానికి తల్లిదండ్రులకు భోజన సమయం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు.
పిల్లలు భోజనం చేసేటప్పుడు టీవీ ఎందుకు చూడకూడదు?
భోజన సమయాల్లో టీవీ చూడటం లేదా మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల పిల్లలు ఆకలితో ఉన్నారా లేదా కడుపు నిండుగా ఉన్నారో తెలియదు. వారి శరీరం ఏమి చెబుతుందో వారికి తెలియదు. ఇది అతిగా తినడం లేదా తక్కువ తినడం, ఊబకాయం లేదా పోషక అసమతుల్యత ప్రమాదాన్ని పెంచుతుంది. భోజన సమయంలో పిల్లలను వారి ఆహారంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించాలని వైద్యులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల తిన్నది వంటపడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా టీవీల్లో వచ్చే ప్రకటనలు కూడా పిల్లల మనసులపై ప్రభావం చూపుతాయి. వాణిజ్య ప్రకటనలు, ఆకర్షణీయమైన దృశ్యాలు, సంగీతం పిల్లలను ఆకర్షిస్తాయి. ఈ ప్రకటనల్లో చాలా వరకు చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ఉత్పత్తులను ప్రచారం చేస్తాయి. ఇది చూసి పిల్లలు ఆ ఆహారం కావాలని పట్టుబట్టవచ్చు. ఇది పిల్లల ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు అంటున్నారు. భోజన సమయాల్లో టీవీని చూడడం తగ్గిస్తే ఆహార ప్రాధాన్యతలపై ఈ ప్రకటనల ప్రభావాన్ని తగ్గించవచ్చని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.
నిపుణుల సలహా:
వంట చేసేటప్పుడు మీ పిల్లలను చిన్న చిన్న పనులు అప్పగించాలి. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చొని భోజనం చేయాలని అంటున్నారు. పిల్లలకు ఇష్టంలేని ఆహారాన్ని బలవంతంగా ఇవ్వడం వల్ల వారికి భోజనం పట్ల విరక్తి ఏర్పడుతుందని అంటున్నారు. అంతేకాకుండా శిశువుకు ఎప్పుడూ అతిగా ఆహారం ఇవ్వొద్దని ఆకలిగా ఉన్నప్పుడే తినిపించాలని అంటున్నారు.
ఇది కూడా చదవండి: అధిక బరువు తగ్గించే ఐదు రకాల చట్నీలు.. ఎలా చేసుకోవాలంటే?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.