Ap Rains: ఏపీని వరుణుడు విడిచిపోను అంటున్నాడు. అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో మంగళవారం కూడా ఏపీలో పలుచోట్ల వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు.
.మరోవైపు ఎగువన ఉన్న రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ఫలితంగా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమవారం రాత్రి ఏడు గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.05లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు.
ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని.. సోమవారం రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు. రెండో ప్రమాద హెచ్చరిక వలన ప్రభావితమయ్యే జిల్లాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు కూర్మనాథ్ వెల్లడించారు. అత్యవసర సహాయక చర్యల కోసం నాలుగు ఎన్టీఆర్ఎఫ్, నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధం చేసినట్లు చెప్పారు.
Also read: తెలివి తక్కువ దద్దమ్మ అన్నందుకు..పెళ్లైన మూడు నిమిషాలకే విడాకులు!