Supreme Court Youtube Channel Hack : ఈ మధ్య కాలంలో సైబర్ క్రైం, అకౌంట్లు హ్యాక్ వంటి వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం. అయితే తాజాగా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ కావడం సంచలనంగా మారింది. హ్యాకర్లు ఏకంగా సుప్రీం కోర్టు ఇండియా అనే పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్‌ను పేరును రిప్పల్ అని మార్చారు. సాధారణంగా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానల్‌లో రోజూ కోర్టు లైవ్, తీర్పుల గురించి కంటెంట్ వస్తుంది. కానీ ఈరోజు వాటి స్థానంలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వీడియోలు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో అకౌంట్ హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు.
ఎవరు యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేశారు? ఎందుకు చేశారు? ఏదైనా కుట్ర కోణం ఉందా? అన్న కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. మరో వైపు హ్యాక్ గురైన ఛానల్ ను పునరుద్ధరించడానికి.. అందులోని కంటెంట్ డిలీట్ కాకుండా ఉండేందుకు సాంకేతిక నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ కు గురికావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇందుకు కారణమైన వారిని గుర్తించాలన్న లక్ష్యంతో వారు విచారణ చేస్తున్నట్లు సమాచారం.