Golden Watch : టైటానిక్(Titanic) ఓ అద్బుత ప్రేమ కావ్యం మాత్రమే కాదు.. అంతులేని విషాదం కూడా. 1912లో ఏప్రిల్ 15న ఈ టైటానిక్ భారీ మంచు కొండను ఢీకొట్టంతో ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో అనేక మంది మరణించారు. వారిలో ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెరికా వ్యాపారవేత్త జాన్ జాకబ్ ఆస్టర్(John Jacob Auster) కూడా ఉన్నారు.
తాజాగా ఆయన చేతికి ఉన్న గోల్డ్ వాచ్ ను ఇంగ్లాండ్(England) లో వేలం వేశారు. దీనికి ప్రపంచ రికార్డు స్థాయి ధర పలికింది. ఏకంగా 1.46 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో రూ. 12. 17 కోట్లకు అమ్ముడైంది. వాచ్ ను వేలం పాట నిర్వహించిన హెన్నీ ఆల్డ్ రిడ్జ్ అండ్ సన్ ఈ విషయం గురించి వివరించింది.
అయితే నిర్వహకులు ఈ వాచ్ కు లక్ష నుంచి లక్షన్నర పౌండ్ల వరకు రావొచ్చని నిర్వాహకులు అంచనా వేశారు. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి వారి అంచనాలను పటాపంచలు చేస్తూ భారీ ధరకు దాన్ని కొనుగోలు చేశాడు. టైటానిక్ లో భార్య మెడిలీన్ తో కలసి ఆస్టర్ ప్రయాణించారు. ప్రమాద సమయంలో షిప్ లోని లైఫ్ బోట్ లలో ఒక దానిలోకి భార్యను ఎక్కించారు. అయితే తనను తాను కాపాడుకోలేక సముద్రంలో మునిగి మరణించారు. ఈ ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత ఆస్టర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పుడు వారికి అందిన ఆస్టర్ వ్యక్తిగత వస్తువుల్లో వాచ్ కూడా ఉంది.
ఆ తర్వాత కాలంలో ఆ వాచ్ ను పూర్తిస్థాయిలో రిపేర్ చేసి తిరిగి పనిచేసేలా చేశారు. ఆ వాచ్ పై జేజేఏ అనే అక్షరాలు ఉన్నాయి. ఆస్టర్ కుమారుడు కొంతకాలం దాన్ని ధరించారని వేలం నిర్వాహక సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. టైటానిక్ కు సంబంధించిన వస్తువుల్లోకెల్లా రికార్డు స్థాయి ధర పలికిన వస్తువు ఈ వాచేనని సమాచారం.