Woman : దేశంలో రోజురోజుకూ డిజిటల్ లావాదేవీలు(Digital Transactions) పెరుగుతుండటంతో ఆన్ లైన్ మోసగాళ్లు(Online Fraud) కూడా కొత్తకొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. బెంగళూరు(Bangalore) కు చెందిన అదితి చోప్రా అనే మహిళ ఈ తరహా మోసాన్ని బట్టబయలు చేసింది. డబ్బు కొట్టేసేందుకు కేటుగాళ్లు వేసిన ప్లాన్ నుంచి తాను ఎలా బయటపడ్డానో తాజాగా నెటిజన్లతో పంచుకుంది. బ్యాంకు అకౌంట్ లోకి డబ్బు క్రెడిట్ చేసినట్లు మోసగాళ్లు తన ఫోన్ కు పంపిన ఫేక్ మెసేజ్ లను ‘ఎక్స్’లో షేర్ చేసింది. అలాగే ఒక సుదీర్ఘ పోస్ట్ ను పెట్టింది.
‘బెంగళూరులోని ఆఫీసులో పనిచేస్తుండగా ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఓ పెద్దాయన గొంతుతో నాకొకడు ఫోన్ చేశాడు. నన్ను పేరు పెట్టి మరీ పిలిచాడు. మా నాన్నకు ఇవ్వాల్సిన డబ్బును ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేయాల్సి ఉందని.. కానీ ఆయన నా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయమన్నారని చెప్పాడు. ఆ వెంటనే నా ఖాతాలోకి రూ. 10 వేలు, రూ. 30 వేలు క్రెడిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ అంతలోనే పొరపాటు జరిగిందని.. రూ. 3 వేలు పంపే బదులు ఒక సున్నా ఎక్కువ నొక్కేశానని.. అందుకే రూ. 30 వేలు క్రెడిట్ అయ్యిందని చెప్పాడు. అదనంగా పంపిన డబ్బును తిరిగి పంపాలని కోరాడు. కానీ నేను తీక్షణంగా ఎస్ఎంఎస్ లను పరిశీలించగా అవి బ్యాంకు నుంచి వచ్చినట్లు కనిపించలేదు. ఒక 10 అంకెల నంబర్ నుంచి వచ్చినట్లు గుర్తించా. మెసేజ్ ల పక్కన ఎర్ర జెండాల బొమ్మ కనిపించడంతో నా అనుమానం మరింత బలపడింది. దీంతో ఫోన్ కట్ చేశా. నా బ్యాంక్ ఖాతా(Bank Account) ను చెక్ చేసుకున్నాక ఆ నంబర్ కు తిరిగి కాల్ చేసేందుకు ప్రయత్నిస్తే నా నంబర్ ను బ్లాక్ చేశారు’ అని అదితి చోప్రా తన పోస్ట్ లో పేర్కొంది.
సాధారణంగా ఎవరికైనా అలాంటి ఫోన్ కాల్ రాగానే వెంటనే డబ్బు వెనక్కి పంపించేస్తారని ఆమె చెప్పింది. కానీ తన తండ్రి ఎప్పుడూ డబ్బు విషయంలో ఒకటికి మూడుసార్లు సరిచూసుకోవాలని చెబుతుంటారని.. అదే తనను మోసగాళ్ల బారి నుంచి కాపాడిందని తెలిపింది.
‘మీకు వచ్చే ఎస్ ఎంఎస్ లను దయచేసి చదువుకోండి. ఆర్థిక లావాదేవీల విషయంలో వచ్చే మెసేజ్ లను నమ్మకండి’ అంటూ పోస్ట్ చేసింది. ఈ తరహా మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ‘ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ ను వేరే ఫోన్ లో చెక్ చేసుకోండి. ఎస్ ఎంఎస్ లను చూసి నిర్ణయాలు తీసుకోకండి’ అని ఆమె చెప్పింది.
Also Read : నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా?.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు