Sankranthi: సంక్రాతి పండుగ సందర్భంగా నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. పిల్లలకు సెలవులు ప్రకటించడమే ఆలస్యం అన్నట్లు వారంనుంచి సిద్ధంగా ఉన్న జనాలు రెండు రోజులుగా బస్సులు, రైళ్లలో కిక్కిరిపోతున్నారు. సికింద్రాబాద్ (Secundrabad) రైల్వే స్టేషన్‌తో పాటు జూబ్లీ (Jubli) బస్టాండ్, ఎంజీబీఎస్(Mgbs), సీబీఎస్ (Cbs) బస్టాండ్‌లు ఉదయం 5 గంటలనుంచి అర్థరాత్రివరకూ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతిని ఘనంగా జరుపుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజవాడ (Vijyawasa) వైపు బారులు తీరారు.
తండోప తండాలుగా..
ఈ మేరకు సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రజలు తండోప తండాలుగా ఎల్బీనగర్ రింగ్‌రోడ్డుకు చేరుకోవడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. విజయవాడ హైవేపై పుల్ రష్ ఏర్పడింది. కీసర టోల్‌గేట్ దగ్గర భారీగా వాహనాలు క్యూ కట్టాయి. దీంతో హైవేపై కిలోమేటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. అలాగే సూర్యాపేట రూట్లలో ఉన్న హోటళ్లు సైతం పట్టుచాలని జనంతో కిటకిటలాడుతున్నాయి. వారిలో ఎక్కువగా విజయవాడ వెళ్లే వారు ఉండటంతో టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్ రింగ్‌రోడ్డుకు చేరుకుంటున్న ప్రయాణికుల సంఖ్యను బట్టి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ స్పెషల్ బస్సులను రప్పిస్తూ ప్రజలను వారి గమ్యస్థానాలకు పంపిస్తున్నారు. అయినప్పటికీ బస్సులు సరిపోవట్లేదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. గంటల తరబడి రోడ్లపై నిలబడాల్సివస్తుందని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Karimnagar: నిలిచిపోయిన పందెం కోడి వేలం..ఎందుకంటే!
ప్రత్యేక బస్సులు..
ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రెండు రాష్ట్రాల డిపో మేనేజర్లు తెలిపారు. నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్‌లతో పాటు ఆయా ప్రాంతాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేలకు పైగా బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఆర్టీసీ, ట్రాఫిక్, రవాణ శాఖ అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరం నుంచి జిల్లాలకు వెళ్లేందుకు ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులోని బస్టాప్ వద్దకు వచ్చే ప్రయాణికులు సేద తీరేందుకు టీఎస్‌ఆర్టీసీ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేశామని, దీంతో పాటు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ ప్రజలు తమ గమ్యస్థానాలకు తరలివెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.