Uttar Pradesh Seats: యూపీలో పార్టీల హార్ట్ బీట్ పెంచుతున్న ఆ సీట్లు.. తేడా వస్తే అంతే!

కేంద్రంలో అధికారం దక్కాలంటే ఏ పార్టీ అయినా యూపీలో చక్రం తిప్పాలి. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ దాదాపు స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. కానీ, ఇక్కడ 31 సీట్లు మాత్రం ఎన్డీయే-ఇండియా కూటమి మధ్యలో నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి. ఎందుకలా? తెలియాలంటే ఈ ఆర్టికల్ చూడాల్సిందే 

Uttar Pradesh Seats: యూపీలో పార్టీల హార్ట్ బీట్ పెంచుతున్న ఆ సీట్లు.. తేడా వస్తే అంతే!
New Update

Uttar Pradesh Seats: కేంద్రంలో అధికారం దక్కాలంటే.. ఉత్తరప్రదేశ్ ను గెలవాలి. ఇది దేశ రాజకీయాల్లో చెప్పుకునే మాట. అది నిజం కూడాను. ఎందుకంటే, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా యూపీలో 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 545 సీట్లలో 80 సీట్ల వాటా కలిగి ఉండడం అంటే అది కచ్చితంగా పార్టీల తలరాతలు మార్చే నెంబరే  కదా. ఇక  పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నుండి ఇందిరా గాంధీ వరకు, అటల్ బిహారీ వాజ్‌పేయి నుంచి  నరేంద్ర మోడీ వరకూ అందరూ యుపి నుండి గెలిచి ప్రధానులు అయ్యారు. అందుకే యూపీ ఎంపీ సీట్లు ఏ పార్టీకైనా.. ఏ కూటమికైనా చాలా ముఖ్యమైనవి. ఈ సీట్ల గెలుపోటములు మొత్తం రాజకీయాల లెక్కలు మార్చేస్తాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి.. కాంగ్రెస్ ఇండియా కూటమి ఆమీ తూమీ తేల్చుకుంటున్నాయి. వరుసగా రెండుసార్లు ప్రధాని మోదీ నాయకత్వంలో విజయకేతనం ఎగురవేసిన ఎన్డీఏ కూటమి.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఇక కాంగ్రెస్ ఇండియా కూటమి ఎలాగైనా ఈసారి గెలిచి ఢిల్లీ గద్దె అందుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది. 

Uttar Pradesh Seats:  ఇప్పుడు ఈ రెండు కూటముల మధ్య యూపీ ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నాయి. అక్కడి 80 లోక్ సభ స్థానాల్లో ముఖ్యంగా 31 స్థానాల విషయంలో రెండు కూటముల మధ్య హోరా హోరీ పోరాటం జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఈ సీట్లలో మెజార్టీ స్థానాలు గెలిచిన పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. గత ఎన్నికల్లో ఈ సీట్లలో 22 సీట్లు బీజేపీ గెలుచుకుని ఢిల్లీలో జయకేతనం ఎగురవేసింది. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా.. బీజేపీ పొలిటికల్ ఈక్వేషన్స్ తారుమారు అయ్యే అవకాశం ఉంది. అలా ఎందుకో తెలుసుకుందాం. 

Uttar Pradesh Seats:  ఒకసారి ప్రస్తుత రాజకీయ చిత్రాన్ని చూద్దాం. ఇక్కడ 2019 ఎన్నికల్లో మొత్తం 80 సీట్లలోనూ 64 బీజేపీ కూటమి గెలుచుకోగా, ఎస్పీకి 5, బీఎస్పీకి 10, కాంగ్రెస్‌కు ఒక సీటు దక్కింది. అయితే, 31 సీట్లలో గెలుపు ఓటమికి మధ్య తేడా లక్ష ఓట్లు లేదా అంతకంటే తక్కువ.  22 సీట్లు బీజేపీ, 6 సీట్లు బీఎస్పీ, రెండు సీట్లు ఎస్పీ, ఒక సీటు అప్నాదళ్ (ఎస్) గెలుచుకున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు ఈ సీట్ల విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. 400 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి.. యూపీ సీట్లు చాలా కీలకం. 

Also Read: రేవ్ పార్టీ.. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టుల రేవు పెట్టుకుంటున్న పార్టీలు!

Uttar Pradesh Seats:  ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి హోరాహోరీ పోరాడుతున్న పరిస్థితి ఉంది. బీఎస్పీయే మాయావతి కూడా పోటీలో ఉండి.. దీనిని ముక్కోణపు పోటీలా కంపించేలా చేస్తున్నా.. అక్కడి గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. పోటీ రెండు కూటముల మధ్య మాత్రమే ఉండేలా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో.. గతంలో తక్కువ మార్జిన్ తో ఓడిపోయిన సీట్లపై కాంగ్రెస్-సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) గట్టి ఫోకస్ పెట్టాయి. 

Uttar Pradesh Seats:  గత లోక్ సభ ఎన్నికల్లో తక్కువ మార్జిన్లు వచ్చిన సీట్లను పరిశీలిస్తే.. గెలుపు ఓటములకు పదివేల లోపు వచ్చిన సీట్లు నాలుగు ఉండగా, అందులో ఐదు వేల లోపు మార్జిన్ వచ్చిన సీట్లు రెండు ఉన్నాయి. ఇది కాకుండా, 5 స్థానాల్లో గెలుపు ఓటముల మధ్య 10 వేల నుంచి 20 వేల మధ్య వ్యత్యాసం ఉంది. ఏడు లోక్‌సభ స్థానాల్లో గెలుపు ఓటము 20 వేల నుంచి 50 వేల మధ్య ఉంది. ఇది కాకుండా రాష్ట్రంలోని 15 లోక్‌సభ స్థానాల్లో గెలుపు ఓటముల తేడా 50 వేల నుంచి లక్ష వరకు ఉంది. ఇప్పుడు ఈ స్థానాలపై ఫోకస్ పెట్టడం ద్వారా అక్కడ గెలుపు సాధిస్తే ఢిల్లీకి రూట్ క్లియర్ అయినట్టే అని కాంగ్రెస్-ఎస్పీ భావిస్తున్నాయి. ముస్లిం-యాదవ్ ఓటుబ్యాంకు తమకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో.. మాయావతి ఎస్సీ ఓట్లను చీల్చే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితుల్లో.. కాస్త గట్టిగా ప్రయత్నిస్తే ఇది పెద్ద కష్టం కాదనేది కాంగ్రెస్-ఎస్పీ పార్టీల ఆలోచనగా కనిపిస్తోంది. బీజేపీ కొర్ ఓట్ బ్యాంక్ ఈబీసీల పైన కూడా ఈ రెండు పార్టీలు గట్టిగ దృష్టి సారించాయి. ఆ ఓట్లను చీల్చగలిగితే.. కచ్చితంగా బీజేపీకి అది పెద్ద దెబ్బగా మారె పరిస్థితి ఉంటుంది. 

Uttar Pradesh Seats:  రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈసారి యుపిలోని లోక్‌సభ స్థానాలు మాత్రమే అధికార మూడ్‌ను నిర్ణయించే అవకాశం ఉంది.  ఎందుకంటే గత రెండుసార్లు రాష్ట్రంలో బిజెపి అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అటువంటి పరిస్థితిలో, లక్ష కంటే తక్కువ మార్జిన్ ఉన్న 31 సీట్లు రాజకీయ పార్టీల హార్ట్ బీట్ ను పెంచుతున్నాయి.  దీని కారణంగా బీజేపీ మరింత ఆందోళన చెందుతోంది. బీజేపీకి వీటిలో 22 సీట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీట్లలో  కొన్ని ఓట్లు గల్లంతు కావడం లేదా మరొకరి ఖాతాలోకి వెళ్లడం వల్ల బీజేపీకి ఆ సీట్లను కాపాడుకోవడం కష్టంగా మారుతుంది. తక్కువ ఆధిక్యం ఉన్న సీట్లపై బీజేపీ కూడా వ్యూహాలను సిద్ధం చేసుకుంది. మరోవైపు, వాటిని ఎలాగైనా గెలవాలని ఎస్పీ తహతహలాడుతోంది. ఎస్పీ-కాంగ్రెస్ తక్కువ మార్జిన్ల సీట్లపై తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఈ సీట్లను ఎలా కాపాడుకుంటుందో వేచి చూడాల్సిందే. 

ఏది ఏమైనా.. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి ఎంత గట్టిగా ఉంటుందని భావించినా.. గెలుపు మాత్రం నల్లేరుపై నడక కాదని స్పష్టం అవుతోంది. యూపీలో పరిస్థితి ఇలా ఉంటే.. దక్షిణాదిన కర్ణాటక, కేరళ, ఉత్తరాదిన ఢిల్లీ వంటి చోట్ల బీజేపీకి ఎదురుగాలి గట్టిగానే ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సీటు కీలకం కాబోతోంది. అందుకే బీజేపీ అనుకున్నట్టు 400 సీట్ల మాట అటుంచితే.. కనీసం గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే కొద్దీ సీట్లు ఎక్కువగా సాధిస్తేనే బీజేపీ అధికారం సాధించడానికి రూట్ క్లియర్ గా ఉంటుంది అని చెప్పవచ్చు. 

#congress #uttar-pradesh #nda #india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe