/rtv/media/media_files/2025/09/27/dussehra-offers-2025-09-27-18-18-49.jpg)
Dussehra offers
Dussehra offers : తెలంగాణలో దసరా అనగానే మందు, మాంసం తప్పనిసరి. దసరా రోజు యావత్ తెలంగాణ మాంసం, మందుతో విందుల్లో మునిగిపోతుంది. అయితే ప్రతిసారి దసరా వచ్చిందంటే బట్టల షాపులు, ఇతర షాపింగ్ మాల్స్ ఆఫర్లు ప్రకటించడం షరామాములే. అయితే తామేం తక్కువ తిన్నామా అంటూ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇలాంటి ఆఫర్లే పెడుతున్నారు. అయితే అదెలా అంటే రూ.100 నుంచి రూ.500 వరకు టికెట్లు పెట్టి లక్కీడ్రాలు నిర్వహిస్తున్నారు. ఆ డ్రాలో గెలుపొందిన వారికి మేక, మందు, మిక్సీ, బీర్లు పట్టు చీరలు ఇలా అనేక బహుమతులు ప్రకటిస్తున్నారు. లక్కీ డ్రాలో మేకను మొదటి బహుమతిగా ఇస్తామని ప్రకటించడంతో ఈ లక్కీ డ్రా వైరల్ అవుతోంది. ప్రజల ఆసక్తిని మరింత పెంచేందుకు నిర్వహిస్తున్న ఈ వినూత్న కార్యక్రమానికి మంచి స్పందన కూడా వస్తోంది.
200 కొట్టు మేకను పట్టు
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో కొంతమంది వింత లక్కీ డ్రాను నిర్వహిస్తున్నారు. దసరా సందర్భంగా 200 కొట్టు.. మేకను పట్టు అంటూ ప్లేక్సీలు కట్టి మరి ప్రచారం చేస్తున్నారు. ఈ డ్రాలో గెలుపొందితే మొదటి బహుమతిగా 10 కిలోల మేక, రెండో బహుమతిగా మిక్సీ, మూడో బహుమతిగా పట్టుచీర, నాలుగో బహుమతిగా రెండు రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్స్, ఐదో బహుమతిగా కాటన్ బీర్లుగా అని ప్రకటించి సంచలనం రేపారు. అయితే ఈ డ్రా ఉచితం కాదు దీనికోసం రూ.200లు పెట్టి కూపన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఎన్ని కూపన్లు అయినా తీసుకోవచ్చు. దసరా రోజు గోవింద్రాల గ్రామంలోని కూడలి వద్ద డ్రా తీస్తారు. ప్రజలందరి సమక్షంలో తీసే ఈ డ్రాలో విజేతలుగా నిలిచిన ఐదుగురికి సదరు బహుమతులు అందజేయనున్నారు.
రూ.150 కొట్టు.. పొట్టేలు పట్టు
ఇక జగిత్యాల జిల్లాలో మరో బంపర్ ఆఫర్ అందరిని ఆకట్టుకుంటోంది. రూ.150 కొట్టు.. పొట్టేలు పట్టు అంటూ ఆఫర్ ప్రకటించాడో వ్యక్తి. ఇప్పుడిది నెట్టింట వైరల్‌గా మారింది. జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండల ప్రాంతానికి చెందిన సాయిని తిరుపతి అనే వ్యక్తి ఈ వెరైటీ ఆఫర్ ప్రకటించాడు. దసరా పండుగకు ఈ ఆఫర్ ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ డ్రాలో గెలుపొందితే మొదటి బహుమతిగా మేక, సెకండ్ ప్రైజ్‌గా బీర్ కేసు, మూడో బహుమతిగా విస్కీ బాటిల్, నాలుగో బహుమతిగా నాటుకోడి, ఐదో బహుమతిగా చీర ఇవ్వనున్నారు. అక్టోబర్ 1న డ్రా తీయనున్నారు. ఈ ఆఫర్ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.
రూ. వంద కొట్టు కోడిని పట్టు.. లక్కు దక్కితే మేకపోతు మీ స్వంతం..!
వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో డిఫరెంట్ గా లక్కీ డ్రా ప్రవేశపెట్టారు. దసరా ధమాకా పేరుతో ఓ యువకుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. 100 రూపాయలు చెల్లిస్తే 5 బహుమతులు ఇస్తామంటూ పర్వతగిరి మండలం అన్నారం తండాకు చెందిన భూక్య విగ్నేష్ అనే యువకుడు దసరా బోనాంజ అంటూ ఆఫర్లు ప్రకటించారు. వంద రూపాయలు చెల్లించి ఒక టోకెన్ తీసుకుంటే దసరా రోజు లక్కీ డ్రా తీస్తామంటున్నాడు. ఈ లక్కీ డ్రాలో లక్కు తగిలిన వారికి మొదటి బహుమతిగా మేకపోతు, రెండవ బహుమతిగా మద్యం ఫుల్ బాటిల్, 3వ బహుమతి కాటన్ బీర్లు, 4వ బహుమతిగా 2 పట్టుచీరలు, ఐదవ బహుమతిగా 2 నాటు కోడి పుంజులు ఇస్తామని ప్రకటించి వార్తల్లో నిలిచాడు.
ఇలాంటివి తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పలువురిని ఆకట్టుకుంటున్నాయి, వారంతా ఏకంగా ఓ ప్లెక్సీలు తయారుచేసి ప్రచారం చేస్తున్నారు. దసరా పండగ సందర్భంగా వీరు చేపట్టిన వినూత్న కార్యక్రమం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టోకెన్లు తీసుకునేందుకు జనం పెద్ద ఎత్తున ఆసక్తిని చూపుతున్నారు.
ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు