/rtv/media/media_files/2025/10/11/ponguleti-vs-konda-2025-10-11-13-02-15.jpg)
Ponguleti vs Konda
Ponguleti vs Konda Murali : ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం సమసిపోక ముందే వరంగల్ జిల్లాలో మరో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు పొడచూపాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధిపత్య తీరుపై అదే జిల్లా మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఏకంగా కాంగ్రెస్‌అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేంతవరకు ఈ విభేదాలు చేరినట్లు తెలిసింది. రేవంత్ సర్కార్‌కు ఉమ్మడి కరీంనగర్ సెగ చల్లారక ముందే వరంగల్ జిల్లా పొగ రాజుకోవడం తలనొప్పిగా మారింది.
వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి దుమారం రేగింది. తమ జిల్లా రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జోక్యం చేసుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేత కొండా మురళి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ జిల్లాలో పొంగులేటి పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడమే కాకుండా దీనిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు కొండా మురళి ఫిర్యాదు చేశారు. మేడారం టెండర్ల వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. టెండర్లలో పొంగులేటి సొంత కంపెనీకి పనులు ఇప్పించుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోపాటు మీనాక్షి నటరాజన్‌కు సైతం కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో హైకమాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ఆయన తెలిపారు
ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అదే జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి మేడారం కేంద్రంగా జరిగే పనులే కేంద్ర బిందువుగా మారాయి. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతర నేపథ్యంలో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పొంగులేటి ఆధిపత్యంపై మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. బహిరంగంగానే మంత్రి పొంగులేటి వ్యవహారంపై పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించిన దాఖలాలూ ఉన్నాయి.
అసలేం జరిగిందంటే..
మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల నవనిర్మాణం కోసం రూ.71 కోట్ల టెండర్లను ప్రభుత్వం పిలిచింది. దేవాదాయ శాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన సీతక్కకు కనీస సమాచారం లేకుండానే టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందనే చర్చ సాగుతున్నది. గతనెల 23న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు మేడారం సందర్శించారు. ఆ సమయంలో మేడారంలో చేపట్టనున్న పనులను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి వారానికి ఒకసారి అయినా సమీక్షించాలని సీఎం ఆ సందర్భంగా చెప్పారు. ఆ సమయంలోనే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సీతక్క, సురేఖ షాక్‌కు గురయ్యారని, దీనికితోడు అదే సభలో సంబంధిత మంత్రి కొండా సురేఖకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమాన పరిచారనే ఆరోపణలు వినిపించాయి.తాజాగా మేడారం పనుల టెండర్ల ముసుగులో తన సంబంధీకులకు, తన జిల్లా వారికి పనులను కట్టబెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి.మహిళా మంత్రి కొండా సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్న దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి పెత్తనం ఏమిటి? అని ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ మురళీ అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. తన మంత్రిత్వ శాఖలో తనకు తెలియకుండా టెండర్లు పిలవడం ఎంతవరకు న్యాయమని, ఈ విషయంలో ఆమె అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
Also Read: Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరించకూడదు..ప్రభుత్వ సంచలన నిర్ణయం