/rtv/media/media_files/2025/03/22/OVoBNSIYe98bthfMIYw3.jpg)
EX Minister Mallareddy
Malla Reddy : రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి మేడ్చల్ ఎంఎల్‌ఏ చామకూర మల్లారెడ్డి అలా అనలేదంటూ మాట మార్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని తాను అనలేదంటూ క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు పెడతానని మాత్రమే చెప్పానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు తాను ప్రస్తుతం బీఆర్‌ఎస్ లోనే ఉన్నానని, ఆ పార్టీలోనే కంటీన్యూ అవుతానని కూడా స్పష్టం చేశారు. తాను తెలుగుదేశం, బీజేపీలోకి వెళ్తానని జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తదే అన్నారు.
అయితే రిటైర్‌మెంట్‌విషయమై తాను తన మిత్రుడితో మాట్లాడిన మాటలను వేరే తీరుగా అన్వయించుకున్నారని మల్లారెడ్డి తెలిపారు. జపాన్‌లో ఏ విధంగా రిటైర్‌మెంట్ ఉండదో.. రాజకీయాలకు కూడా రిటైర్‌మెంట్ ఉండదని మాత్రమే తన మిత్రుడితో అన్నానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు (ఆదివారం) మల్లారెడ్డి తన నియోజకవర్గంలోని జవహర్‌నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనులు చేశారు. అనంతరం మల్లారెడ్డి పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన రిటైర్‌మెంట్ అంశంపై జరుగుతున్న చర్చకు క్లారిటీ ఇచ్చారు.
అసలేం అన్నారంటే...
కాగా ఆయన నిన్న మాట్లాడుతూ తాను రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ వైపా అన్నది కాదని... తాను ప్రస్తుతం బీఆర్ఎస్‌లోనే ఉన్నాను. తాను ఇప్పుడు ఏ పార్టీ వైపునకు చూసే ఉద్ధేశం ఏ మాత్రం లేదు. తనకు 73సంవత్సరాలు వచ్చాయని.. ఇంకా ఏవైపునకు చూడాల్సిన అవసరం ఏముందని మల్లారెడ్డి అన్నారు. తాను ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యానని ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటానని మల్లారెడ్డి వెల్లడించారు. అస్సలు తాను రాజకీయమే వద్దనుకుంటున్నానని సంచలన తూటా పేల్చారు. ప్రజలకు సేవ చేయడం కోసం మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నానని చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు.
రాజకీయ ప్రస్థానం..
చామకూర మల్లారెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదటగా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభించారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎంపీగా మల్లారెడ్డి నిలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుంచి 2016లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2018లో వచ్చిన శాసనసభ ఎన్నికల్లో ఆయన మేడ్చల్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో 2019లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంలో మల్లారెడ్డికి స్థానం కల్పించారు. కార్మిక, ఉపాధి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా మల్లారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాష్ర్టంలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పొవడంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే బీఆర్‌ఎస్ అధికారం కోల్పొయిన సమయంలో ఆయన కాంగ్రెస్, బీజేపీలో చేరుతారన్న ప్రచారం సాగింది. మరోవైపు టీడీపీలోనూ చేరుతారని ప్రచారం సాగింది. కానీ, ఆయన బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని తేల్చి చెప్పడం గమనార్హం.
ఇది కూడా చూడండి:KTR vs Bandi Sanjay : బండి సంజయ్‌కి 48 గంటల డెడ్‌లైన్.. సారీ చెప్పకపోతే అంతే...కేటీఆర్ వార్నింగ్