/rtv/media/media_files/2025/10/12/btech-student-commits-suicide-2025-10-12-11-26-22.jpg)
B.Tech student commits suicide
Crime News : తల్లిదండ్రులను వదిలి ఉండలేక, పాఠాలు అర్థం కాక మనస్థాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ రూరల్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ గ్రామానికి చెందిన కృష్ణాకర్‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె జె.కీర్తన (19) ఈ ఏడాది ఇంజినీరింగ్‌లో జాయిన్ అయింది. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.
అయితే కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి అధ్యాపకులు చెప్పిన పాఠాలు అర్థం కావటం లేదని, తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక పోతున్నానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాధపడుతుండేది. దీంతో ఆమెను ఇంటికి రప్పించిన తల్లిదండ్రులు ఆమెను సమీపంలోని కళాశాలలో చేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఆ ప్రయత్నంలో ఉండగానే ఈ నెల 10న శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత సమయానికి ఇంటికి వచ్చిన తండ్రి కృష్ణాకర్ గమనించి వెంటనే కిందకు దించి గ్రామంలోని ఆర్‌ఎంపీని పిలిపించి పరీక్షించారు. కానీ కీర్తన అప్పటికే మృతి చెందింది. శనివారం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.