Lovers: ఒకరిని విడిచి ఒకరు ఉండలేక.. ప్రేమజంట బలవన్మరణం

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వారికంటే ముందు పెళ్లి కావలసినవారు ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. మనస్థాపంతో అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడగా, ఆమెను విడిచి ఉండలేక అబ్బాయి సూసైడ్‌ చేసుకున్నాడు.

New Update
Couple commits suicide

Couple commits suicide

Lovers: వారిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు అడ్డు చెప్పనప్పటికీ వారికంటే ముందు పెళ్లి కావలసినవారు ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే వారి మనస్థాపానికి దారి తీసింది. అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడగా, ఆమెను విడిచి తాను ఉండలేనంటూ అబ్బాయి సూసైడ్‌ చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది.

రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆరుట్ల గ్రామానికి చెందిన పంబాల నందిని(18), మంకు నాగరాజు(25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని వారిద్దరూ తమ తల్లీదండ్రులు, కుటుంబ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.  అయితే వారికంటే ముందు పెళ్లి  కావాల్సిన వారు రెండు కుటుంబాల్లోనూ ఉన్నారని.. అప్పటివరకు ఆగాలంటూ తల్లిదండ్రులు సూచించారు. ఈ విషయంలో నందిని వాళ్లింట్లో కొంత గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన నందిని సోమవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంలో నందిని మరణానికి  నాగరాజు కారణమంటూ కుటుంబ సభ్యులు మంచాల ఠాణా వద్ద మంగళవారం ధర్నా చేశారు.  

ఈ విషయం తెలిసిన నాగరాజు ఆగాపల్లిలోని తమ బంధువుల ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం శివారులోని చింతచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  నందిని ఆత్మహత్యతో మనస్తాపం చెంది నాగరాజు బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబీకులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. సుమారు 48 గంటల వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. కాగా ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక.. ప్రియుడు సైతం బలవన్మరణానికి పాల్పడినట్లు  మంచాల సీఐ మధు, స్థానికులు తెలిపారు. రెండు ఘటనలపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  

ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు!

Advertisment
తాజా కథనాలు