/rtv/media/media_files/2026/02/17/fotojet-15-2026-02-17-12-50-00.jpg)
Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నికలు రణరంగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం వివిధ కారణాలతో వాయిదా పడ్డ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీల్లో ఈ రోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక జరిగింది. కాగా ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ బీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.. 3వ వార్డు మెంబర్ టేకుల సుదర్శన్ రెడ్డి 15 ఓట్లతో మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రం మళ్లీ వాయిదా పడింది. దీన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన పరిస్థితుల్లో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి బీఆర్ఎస్ ఈ స్థానాన్ని దక్కించుకుంది.
సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా కిషంగుల ప్రమీల, వైస్ చైర్మన్‌గా పటోళ్ల హరీశ్ రెడ్డి ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఇంద్రేశం మున్సిపాలిటీలో పాలికలో 18 వార్డులు ఉండగా అత్యధికంగా 9 వార్డులను బీఆర్‌ఎస్ గెలుచుకుంది, ఆరు వార్డులు కాంగ్రెస్, రెండు వార్డులు బీజేపీ, ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. కానీ, నిన్న జరగాల్సిన చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. ఇవాళ ఎన్నిక నిర్వహించగా మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం గమనార్హం.
ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
కాగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈ రోజు కూడా ఉద్రిక్తత నెలకొంది. చేతులెత్తి (Open Ballot) చైర్మన్‌ను ఎన్నుకోవాలని అధికారులు సూచించారు. అయితే, దీనికి కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రహస్యంగా ఓటింగ్ నిర్వహించాలని గొడవకు దిగారు. మరోవైపు, ఎన్నికల నియమావళి ప్రకారమే ఓటింగ్ జరగాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఒక దశలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఈ క్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడులకు దిగారు. మున్సిపల్ కార్యాలయం వద్ద తోపులాట జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల మధ్య ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, రిటర్నింగ్ అధికారి పట్టుదలతో ఓటింగ్ ప్రక్రియను కొనసాగించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అయితే చివరి నిమిషంలో ఇబ్రహీం పట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది.
Follow Us