/rtv/media/media_files/2026/01/14/fotojet-2026-01-14t131559-2026-01-14-13-16-18.jpg)
Medarama Jatara
Medarama Jatara : ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర సందర్భంగా ఆదివాసీ పూజారులు నేడు గుడిమెలిగే పండగను నిర్వహించనున్నారు. బుధవారం నాడు గుడిమెలిగే పండగను అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధమయ్యారు. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరంలో సిద్దబోయిన వంశస్థులు, కన్నెపల్లిలోని సారలమ్మ పూజామందిరంలో కాక వంశీయులు పూజా కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/14/warangal4_v_jpg-816x480-4g-2026-01-14-13-16-58.webp)
గుడిమెలిగే పండుగను పురస్కరించుకుని అత్యంత నియమ నిష్టలతో పూజారులు గుడిని నీటితో శుద్ధి చేసి అటవీ ప్రాంతంలోకి డోలివాయిద్యాల నడుమ పూజారులు, వారి కుటుంబ సభ్యులు వెళ్లి గుట్టగడ్డిని తీసుకొని వస్తారు. గడ్డికి పసుపు, కుంకుమలతో పూజలు చేసిన తర్వాత పూజామందిరాలపై గడ్డిని అలంకరిస్తారు. ఈ తంతుతో వనదేవతల జాతర ప్రారంభమైనట్లుగా పూజారులు భావిస్తారు. ఇప్పటినుంచి జాతర ముగిసే వరకు ప్రతి రోజు మందిరాల్లో పూజాకార్యక్రమాలతో పాటు రాత్రివేళల్లో డోలీలతో కొలుపు నిర్వహిస్తారు. 21న మండెమెలిగే పండగతో జాతరలో భక్తులు మొక్కులు సమర్పించడం కోసం అధికసంఖ్యలో తరలివస్తారు. ఇప్పటికే ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో వస్తున్నారు.మేడారం జాతర సమీపిస్తుండడంతో అమ్మవార్ల గద్దెలతో పాటు ఆలయం చుట్టూ ఉన్న సాలహారానికి దేవాదాయ శాఖ అధికారులు విద్యుత్ లైట్లతో అలంకరణ పనులను మంగళవారం ప్రారంభించారు. రాత్రివేళ దర్శించుకునే భక్తులకు అమ్మవార్ల గద్దెలు కనిపించేలా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/14/warangal3_v_jpg-816x480-4g-2026-01-14-13-17-12.webp)
21న కొండాయి, దొడ్లలో మండమెలిగే..
కొండాయిలో సారలమ్మ, గోవిందరాజులు, నాగులమ్మ జాతరను పురస్కరించుకుని మండమెలిగే పండుగను నిర్వహించేందుకు పూజారులు సిద్ధమయ్యారు. ఏటా కొండాయి, దొడ్ల గ్రామాల్లో నిర్వహించే జాతర కోసం ఐటీడీఏ నుంచి నిధులు మంజూరు చేశారు. కాగా నేడు సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజుల గుళ్లను అందులోని పూజా సామగ్రి ఆడేరాలు, పడిగలు, బూరలు ఇతర సామగ్రిని శుద్ధి చేసి అలంకరిస్తారు. ఆలయ ఆవరణను ముగ్గులతో ప్రవేశ మార్గాల్లో మామిడి తోరణాలు కట్టి ముస్తాబు చేస్తారు. మండమెలిగే పండుగ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ఆడబిడ్డలు తలంటూ స్నానాలు చేసి ముగ్గులు వేస్తారు. శుద్ధి చేసిన పూజా సామగ్రిని తిరిగి పసుపు, కుంకుమలతో అలంకరిస్తామని గోవిందరాజుల ప్రధాన పూజారి దబ్బగట్ల గోవర్దన్, సారలమ్మ పూజారి కాక వెంకటేశ్వర్లు, రాజారం, దబ్బగట్ల సదానందం తెలిపారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/14/medaram-sammakka-sarakka_v_jpg-816x480-4g-2026-01-14-13-17-34.webp)
మహా జాతరకు రెండు వారాల ముందు నుంచే మేడారంలో ఆచార వ్యవహారాలు మొదలవుతాయి.
జనవరి 14 గుడిమెలిగే పండగ: దేవతలకు ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
జనవరి 21న మండమెలిగే పండగ: జాతర విజయవంతం కావాలని కోరుతూ పూజారులు దేవతలను ప్రార్థిస్తారు. ఈ రెండు పండుగలు ముగియడంతోనే మేడారంలో జాతర వాతావరణం పీక్ స్టేజ్‌కు చేరుకుంటుంది.
వనదేవతలు గద్దెలకు చేరుకునే క్రమం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య సాగుతుంది.
జనవరి 27: మహబూబాబాద్ జిల్లా నుంచి పగిడిద్దరాజు, కన్నెపల్లి నుంచి జంపన్న మేడారానికి పయనమవుతారు.
జనవరి 28: కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతారు.
జనవరి 29 (కీలక ఘట్టం): చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క దేవతను పూజారులు తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో భక్తుల పూనకాలు, శివసత్తుల విన్యాసాలతో అడవి దద్దరిల్లుతుంది.
జనవరి 30: భక్తులు సమర్పించే నిలువెత్తు బంగారం (బెల్లం) మొక్కులతో గద్దెలు నిండిపోతాయి.
జనవరి 31: దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
ఫిబ్రవరి 4న నిర్వహించే తిరుగువారం పండుగతో ఉత్సవాలు అధికారికంగా సమాప్తమవుతాయి.
Follow Us