ఇటీవల విడుదలైన తెలంగాణ డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో తండ్రీ కొడుకులు సత్తా చాటారు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు జిల్లా స్థాయిలో టాప్ 10 లోపు ర్యాంకులు సాధించారు. గ్రామానికి చెందిన 50 ఏళ్ల జంపుల గోపాల్ స్థానికంగా ఉండే ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నాడు. టీచర్ ఉద్యోగానికి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీలకు మరో ఐదేళ్లు వయో పరిమితి ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గోపాల్ డీఎస్సీ పరీక్షలు రాశాడు. ఈ పరీక్షల్లో తన సత్తాచాటి తెలుగు పండిట్ కేటగిరిలో జిల్లాస్థాయిలోనే మొదటి ర్యాంకు సాధించడంతో పాటు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మూడో ర్యాంకు పొందాడు.
ఇది కూడా చూడండి: బయలుదేరిన కొన్ని క్షణాలకే కూలిన హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం
కుటుంబమంతా ప్రభుత్వ ఉద్యోగులే..
గోపాల్‌తో పాటు తన కుమారుడు భానుప్రకాశ్ కూడా డీఎస్సీ పరీక్షలు రాయగా.. జిల్లా స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ గణితంలో 9వ ర్యాంకు సాధించారు. తండ్రీకొడుకులు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో గోపాల్ ఇంట్లో ఆనందానికి అవధుల్లేవు. ఇద్దరూ డీఎస్సీ ఫలితాల్లో జిల్లా స్థాయిలో ర్యాంకుల సాధించడంతో స్థానికులు వారిని అభినందిస్తున్నారు. గోపాల్ భార్య విజయలక్ష్మి తెలుగు పండిట్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. రెండు నెలల కిందట వీరి రెండో కుమారుడు చంద్రకాంత్ ఏఈఈ ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. ఇలా ఫ్యామిలీ మొత్తం ప్రభుత్వ ఉద్యోగులే.
ఇది కూడా చూడండి: విషాదం.. కాల్వలో ముగ్గురు గల్లంతు
ఇదే జిల్లా కోస్గి మండలం ముక్తిపహాడ్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు సైతం డీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటారు. గ్రామానికి చెందిన ఈడ్గి కృష్ణయ్య స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లా స్థాయిలో సెకండ్ ర్యాంకు సాధించాడు. ఆయన సోదరుడు ఈడ్గి రమేశ్ ఎస్‌జీటీ విభాగంలో జిల్లాలో 11వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు నిర్వహించిన 55 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. అక్టోబర్ 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఉద్యోగం సాధించిన వారికి నియామకపత్రాలు అందజేయనున్నారు.
ఇది కూడా చూడండి: Lal Bahadur Sastri:చదువు కోసం రోజూ గంగను ఈదిన స్వాతంత్ర సమరయోధుడు