/rtv/media/media_files/2025/08/05/weather-update-2025-08-05-07-19-06.jpg)
Weather Update
దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నాయి. మరికొన్ని చోట్ల భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, చెట్లు నేలకూలడం వంటి సంఘటనలు సంభవించాయి.
Telangana Rains
ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ముఖ్యంగా ఇవాళ (శనివారం) రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
కేవలం ఈ ఐదు జిల్లాలు మాత్రమే కాకుండా.. మరో 19 జిల్లాలకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కురిసే వర్షాల వల్ల పెద్దగా ప్రమాదం లేకపోయినా, కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీని కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి వంటి పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు, నీటిపారుదల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
గత కొద్ది రోజులుగా తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నప్పటికీ, ఇప్పుడు రుతుపవనాలు చురుగ్గా మారడం వల్ల వర్షాల తీవ్రత పెరిగినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని.. ఇది మరో రెండు, మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వం తరపున, జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగిన హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. జల వనరుల శాఖ కూడా అప్రమత్తంగా ఉండి, నదులు, చెరువుల నీటిమట్టాలను పర్యవేక్షించాలని కోరారు. ప్రజలు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్ల నుంచి బయటకు వెళ్లే ముందు వాతావరణ పరిస్థితులను తెలుసుకోవాలని అధికారులు సూచించారు.