హైదరాబాద్‌లో మూసీ తీరంలోని ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. బాపూఘాట్ వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీతో పాటు గాంధీ ఐడియాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాపూఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా దీన్ని అధునాతనంగా.. అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది.
ఎడ్యుకేషన్ హబ్‌గా గాంధీ ఆశ్రమం
అటు ఉస్మాన్ సాగర్, ఇటు హిమాయత్ సాగర్ నుంచి వచ్చే మూసీ, ఈసా నదుల సంగమ ప్రాంతంలో బాపూఘాట్ ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని గాంధీ సరోవర్‌గా అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ బోధనలు, ఆయన ఆచరణ, ఆశయాలను ప్రతిబింబించేలా ఐడియాలజీ సెంటర్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కోర్సులు నిర్వహించే ఎడ్యుకేషన్ హబ్‌గా గాంధీ ఆశ్రమం కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. మూసీ నదీ తీరంలో సుందరమైన విశాల ప్రాంతం కావటంతో.. బాపూఘాట్‌లో ఎలాంటి మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.. దీన్ని ఏ ఆకృతిలో తయారు చేయాలి, ఎంత ఎత్తుతో తయారు చేయించాలి, డిజైన్లు ఎలా ఉండాలి అనేది ఆయా రంగాల నిపుణుల సలహాలు, సూచనలను స్వీకరించనున్నారు.
దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ గాంధీ విగ్రహాలున్నాయి, ఎక్కడెక్కడ గాంధీ ఆశ్రమాలున్నాయి, ఏయే నమూనాలో ఉన్నాయే వెంటనే అధ్యయనం చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. అందరీ దృష్టిని ఆకర్షించేలా బాపూఘాట్‌లో ఎలాంటి విగ్రహం పెట్టాలి, మూసీ నదీ తీరంలో ఎంత ఎత్తున నిర్మించే అవకాశముంది, సాధ్యాసాధ్యాలన్నింటినీ ఆరా తీస్తున్నారు.
Also Read: సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే
గాంధీ అతి పెద్ద విగ్రహం అదే
ప్రస్తుతం దేశంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాల్లో పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఉన్న గాంధీ విగ్రహమే అత్యంత ఎత్తయింది. దీని ఎత్తు 72 అడుగులు. 2013లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది కాంస్యంతో తయారు చేశారు. ఇద్దరు చిన్నారులతో గాంధీ అప్యాయంగా ఉన్నట్లుగా ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ప్రపంచంలో వివిధ దేశాల్లోనూ గాంధీ విగ్రహాలున్నాయి. అమెరికాలోని టెక్సాస్లోని ఇర్వింగ్ లో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద 8 అడుగుల కాంస్య విగ్రహముంది. ఇప్పటివరకు భారతదేశం బయట ఉన్న అతి పెద్ద విగ్రహం ఇదే. గాంధీ దండి మార్చ్‌కు నడుస్తున్న భంగిమలో ఈ విగ్రహముంటుంది. శాంతి, సామరస్యానికి ప్రతీకగా ఇది అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
2018లో గుజరాత్ లోని నర్మదా నదీ తీరంలో ఐక్యతా చిహ్నంగా సర్దార్ వల్లభబాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా దీన్ని నిర్మించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో అంతకంటే ఎత్తున గాంధీ విగ్రహం నిర్మించాలా..? పాట్నాలో ఉన్న మహాత్మ గాంధీ విగ్రహానికి మించిన ఎత్తులో దీన్ని నిర్మించాలా.. ? కూర్చొని ధ్యాన ముద్రలో ఉన్న భంగిమలో గాంధీ విగ్రహాన్ని తయారు చేయించాలా, దండి మార్చ్ కు కదులుతున్నట్లుగా నిలబడి ఉండాలా అనేదానిపై చర్చలు నడుస్తున్నాయి.
Also Read: 'తెలంగాణకు కొత్త సీఎం'
ఇప్పటివరకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎదుట ఉన్న మహాత్మగాంధీ విగ్రహమే ఇప్పటివరకు తెలంగాణలో పెద్దది. ధ్యాన ముద్రలో ఉన్న ఈ గాంధీ విగ్రహం ఎత్తు 22 అడుగులు. మైలైఫ్ ఈజ్ మై మెసేజ్ అనే సందేశంతో కాంస్యంతో దీన్ని తయారు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్న నిర్ణయంతో బాపూఘాట్ లో ఏర్పాటు చేయబోయే గాంధీ విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.