/rtv/media/media_files/2025/09/05/vanteru-prathap-reddy-brs-2025-09-05-12-22-26.jpg)
బీఆర్ఎస్ కీలక నేత, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి వంటేరు వజ్రమ్మ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వజ్రమ్మ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. నేడు జగదేపూర్ మండలంలోని దౌలాపురం గ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వజ్రమ్మ మృతికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఒంటేరు నివాసానికి వెళ్లారు. ఆయన మాతృమూర్తి వంటేరు వజ్రమ్మ భౌతికకాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వంటేరు ప్రతాప్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఒంటేరు ప్రతాప్ రెడ్డిని పరామర్శించారు.
మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి మాతృమూర్తి వంటేరు వజ్రమ్మ భౌతికకాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS నివాళులర్పించారు.
— BRS Party (@BRSparty) September 5, 2025
వంటేరు ప్రతాప్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేటీఆర్ గారితో పాటు… pic.twitter.com/YLEOm0hUdT
బీఆర్ఎస్ లో కవిత సస్పెన్షన్ వ్యవహారం ప్రారంభమైన నాటి నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి వార్తల్లో నిలిచారు. 2018 ఎన్నికల్లో హరీష్ రావుపై ఆయన చేసిన ఆరోపణల వీడియోను కవిత వర్గీయులు వైరల్ చేస్తున్నారు. కేసీఆర్ ను ఓడించేందుకు ఆర్ధిక సహాయం చేస్తానని హరీష్ రావు తనకు చెప్పాడని వంటేరు చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో అంశాన్ని కవిత సైతం తన ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. హరీష్ రావు కేవలం తనతో పాటు కేటీఆర్, కేసీఆర్ ను కూడా ఓడించేందుకు కుట్ర చేశాడని ఆమె ఆరోపించారు. ఈ వీడియోనే ఇందుకు సాక్షమన్నారు. అయితే.. ఈ విషయంపై ఒంటేరు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సమయంలో తాను మాట్లాడింది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికే తాను ఆ ఆరోపణలు చేశానన్నారు.
చాలా రోజుల క్రితమే తాను ఈ విషయాన్ని ఒప్పుకున్నానని ఆయన గుర్తు చేశారు. కొందరు దద్దమ్మలు ఆ పాత వీడియోలను ఇప్పుడు కావాలని తిప్పుతున్నారని ధ్వజమెత్తారు. ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి విషయానికి వస్తే.. టీడీపీతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. 2009, 14 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. 2019లో ఆయనను ఫారెస్ట్ డవలప్మెంట్ చైర్మన్ గా నియమించింది నాటి కేసీఆర్ సర్కార్. ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతున్నారు.